రోడ్లపై అక్రమ పార్కింగ్, ఆక్రమణలు తొలగింపు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు ఎస్ఐ చంద్రకుమార్
సూర్య, సుల్తానాబాద్
సుల్తానాబాద్ మున్సిపల్ పట్టణంలోని ట్రాఫిక్ సమస్యలను నివారించడంతో పాటు వాహనదారులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు సుల్తానాబాద్ ఎస్సై చంద్రకుమార్, మున్సిపల్ అధికారులు బుధవారం చర్యలు చేపట్టారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుంచి కాల్వ శ్రీరాంపూర్ వైపు వెళ్లే రహదారిపై డివైడర్ పక్కన అక్రమంగా పార్క్ చేసిన వాహనాలను ఎస్ఐ చంద్రకుమార్ తన సిబ్బందితో కలిసి తొలగించారు. రహదారులపై నిబంధనలకు విరుద్ధంగా వాహనాలను నిలిపి ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆటో, జీప్ యజమానులను హెచ్చరించారు. మున్సిపల్ కార్యాలయానికి వెళ్లే రహదారికి ఇరువైపులా కిరాణా దుకాణాల ముందు ఉన్న ఆక్రమణలను, రహదారిని ఆనుకుని ఏర్పాటు చేసిన పండ్ల దుకాణాలను మున్సిపల్ కమిషనర్ రమేష్ సిబ్బందితో కలిసి తొలగించారు.రోడ్లను ఆక్రమించి ప్రజలకు, వాహనదారులకు రాకపోకల్లో ఇబ్బందులు కలిగించవద్దని ఎస్ఐ చంద్రకుమార్ సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ రహదారులు ఫుట్పాత్లను ఆక్రమించకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.