భారతదేశంలో మారుతున్న జనాభా పరిస్థితులపై సిడార్ ఆధ్వర్యంలో చర్చాగోష్ఠి
సీతమ్మధార, సూర్య : సొసైటీ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ ఆధ్వర్యంలో బుధవారం విశాఖపట్నంలోని డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాలలో “భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న జనాభా పరిమాణాలు – ఆందోళనలు, భవిష్యత్ కార్యాచరణ” అనే అంశంపై ప్యానెల్ చర్చ నిర్వహించారు.
భారతదేశంలో తగ్గుతున్న సంతానోత్పత్తి రేటు, పెరుగుతున్న ఆయుర్దాయం, వృద్ధుల జనాభా పెరుగుదల, రాష్ట్రాల మధ్య జనాభా మార్పుల్లో వ్యత్యాసాలు, యువత నిరుద్యోగం, జనాభా ప్రయోజనాన్ని సమర్థంగా వినియోగించుకోవాల్సిన అవసరం వంటి అంశాలపై నిపుణులు చర్చించారు.
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి ప్రొఫెసర్ వి. బాలమోహనదాస్ ప్రారంభోపన్యాసం చేశారు. ప్రొఫెసర్ కె.సి. రెడ్డి భారత జనాభాలో చోటుచేసుకుంటున్న ప్రధాన మార్పులను వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య విద్యాశాఖ మాజీ సంచాలకులు, ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ఆర్. శశిప్రభ సంతానోత్పత్తి రేటు తగ్గుదలకు దారితీస్తున్న అంశాలను వివరించారు. డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి డాక్టర్ పి. శ్యామ్ ప్రసాద్ ఉత్తర, దక్షిణ భారత రాష్ట్రాల్లో జనాభా ధోరణుల వ్యత్యాసాలను వివరించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆర్థికశాస్త్ర మాజీ ఆచార్యులు ప్రొఫెసర్ జి. రామచంద్రుడు జనాభా పరివర్తన వల్ల కలిగే సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రభావాలను విశ్లేషించారు.
కృష్ణా విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి, సిడార్ ప్రాజెక్టుల డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్. రామకృష్ణారావు కార్యక్రమానికి స్వాగతం పలికారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ జనాభా పరిశోధనా కేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ బి. మునిస్వామి, సిడార్ ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ డి. హరినారాయణ తదితరులు పాల్గొన్నారు.
కళాశాల యూజీ, పీజీ విభాగాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి.ఎస్.కె. చక్రవర్తి, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డి. దీపక్ చౌదరి, క్యాంపస్ సమన్వయ డీన్ కె. సోమేశ్వరరెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. మారుతున్న జనాభా పరిస్థితులను అర్థం చేసుకుని, భవిష్యత్తుకు అనుగుణమైన విధానాలను రూపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
రిపోర్టర్ : శ్రీను, సీతమ్మధార, విశాఖపట్నం.