BREAKING
నెహ్రూ ఘన నివాళి కౌన్సిలర్లకు ఘన సన్మానం నూతన ఎస్సై తిరుపతిని మర్యాదపూర్వకంగా కలిసిన కొడకండ్ల మండల ప్రెస్ క్లబ్ సభ్యులు విశ్రాంతి గది నిర్మాణానికి రూ 10 లక్షలు విరాళం బాలల అభిప్రాయాలకు గౌరవిస్తూ వారి సమస్యలను పరిష్కరిద్దాం ఇమాంపూర్ గ్రామంలో భారీ వాహనాల బీభత్సం బాలాజీ కుటుంబానికి శ్రీ రాజ్య తండా నాయకుల పరామర్శ విద్యార్థులు గ్రంధాలయాలు సద్వినియోగం చేసుకోవాలి అక్రమ పేలుడు పదార్థాలు స్వాధీనం... ఇద్దరిపై కేసు గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం విద్యార్థుల ఆరోగ్యమే లక్ష్యంగా దోమతెరల పంపిణీ* *- డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ఖాజా మౌనద్దీన్*

యతో ధర్మస్తతో జయః ‎ఆథ్యాత్మికం వ్యాసం

Select Suryaa Now
యతో ధర్మస్తతో జయః ‎ఆథ్యాత్మికం వ్యాసం

"యతో ధర్మస్తతో జయః" ‎(ఆథ్యాత్మికం వ్యాసం)
‎రచన ::--అక్షర కిరీటి తెన్నేటి మాస్టారు 
‎సెల్ ::8247433432
‎‎."యతో ధర్మస్తతో జయః" అంటే ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ విజయం ఉంటుందని అర్థం.
‎"ధరణాత్ ధర్మ ఇత్యాహుః" ధర్మం అంటే ప్రపంచాన్ని నిలబెట్టేదని 
‎పండితులు చెబుతుంటారు కదా.
‎"నిత్యో ధర్మః సుఖదుఃఖే త్వనిత్యే
‎జీవో నిత్యో హేతురస్య త్వనిత్యః" 
‎అంటే ధర్మమే అత్యంత ఉన్నతమైన విలువైనది.
‎ఎందుకంటే ధర్మం మాత్రమే శాశ్వతమైనది. 
‎అస్థిరమైన వాటి మధ్య చక్కటి సమతుల్యతను సాధించగలదు.
‎
‎మన భారతీయులందరికీ పరమ ప్రామాణిక ఇతిహాస గ్రంధమైన మహాభారతం  "యతో ధర్మస్తతో జయః" అనే ఈ మహత్తరమైన సందేశ సారాంశాన్ని  చెబుతోంది ఈ శ్లోకం మహాభారతంలో వివిధ సందర్భాలలో మొత్తం 13 సార్లు వచ్చినదంటే ఈ శ్లోకం ఎంత మహత్తరమైనదో తెలుసుకోండి. అందుకనే మహా భారతంలోని ప్రతీ ఘట్టం ఒక్కో ధర్మానికి వేదిక. ప్రతీ పాత్ర ధర్మానికి నిలువెత్తు రూపం. అందుకనే కదా
‎"ధర్మ తత్త్వజ్ఞులు ధర్మశాస్త్రం బని
‎యధ్యాత్మ విదులు వేదాంత మనియు
‎నీతివిచక్షణుల్ నీతి శాస్త్రంబని
‎కవివృషభులు మహాకావ్యమనియు
‎లాక్షణికులు సర్వ లక్ష్య సంగ్రహ మని
‎యైతిహాసికు లితిహాస మని యు
‎బరమ పౌరాణికుల్ బహుపురాణ సముచ్చ
‎యం బనిమహిఁ గొనియాడు చుండ
‎వివిధ వేద తత్త్వవేది వేద వ్యాసు
‎డాది ముని పరాశరా త్మజుండు
‎విష్ణు సన్నిభుండు విశ్వజనీనమై
‎పరగుచుండ జేసె భారతంబు" 
‎ఆ విధంగా భారతమును వేదవ్యాసుడు వ్రాసెను అని నన్నయ చెప్పాడు కదా.!
‎భగవానుడైన వేదవ్యాసుడు వ్రాసిన లక్ష శ్లోకాలు గల మహాభారతం గూర్చి 
‎
‎"ధర్మే చార్థే చ కామే చ మోక్షే చ భరతర్షభ |
‎యదిహాస్తి తదన్యత్ర యన్నేహస్తి న తత్ క్వచిత్"
‎
‎
‎అంటే "మహాభారతంలో లేనిది లోకంలో లేదు; లోకంలో ఉన్నదంతా మహాభారతంలో ఉంది" అని అర్థం.
‎అంటే మహాభారతంలో ఉన్నది ప్రపంచంలో ప్రతిచోటా ఉంది.
‎మహాభారతంలో లేనిది  ప్రపంచంలో మరెక్కడా లేదు.అని వేదవ్యాసుడు చెప్పాడు కదా.
‎భారతం లోని ప్రధాన పాత్రధారులు ఒకరు ధర్మరాజు, మరొకరు దుర్యోధనుడు.
‎ఇందులో ధర్మరాజు సాక్షాత్తు యమధర్మరాజు వర ప్రభావం వలన జనించిన గొప్ప ధర్మాత్ముడు కదా. మరో అవతారమెత్తిన ధర్మస్వరూపుడు, లోకోత్తర ఆదర్శనీయుడు. 
‎ధర్మం గురించి భారతంలోని కొన్ని ఘట్టాలను గుర్తు చేసుకుందాం.
‎కౌరవులతో జూదం ఆడుతూ ఓడిపోయిన ధర్మరాజు పట్టమహిషి అయిన ద్రౌపది దేవిని నిండు కౌరవ సభలోకి తీసుకువచ్చినప్పుడు "నేను ధర్మ విజితనా? అధర్మ విజితనా? తానోడి నన్నోడెనా? నన్నోడి తానోడెనా? " 
‎అని ద్రౌపది నిండు సభలో అడిగినది. ఆ సభలో కురువృద్ధులు, గురు జనులు, బంధుమిత్రులు, హితులు,  సన్నిహితులు, ఎందరెందరో వున్నారు కానీ ఎవ్వరూ ఆ ప్రశ్నకు జవాబు చెప్పలేదు. ఆ సభలో వున్న చాలామందికి ఆ ప్రశ్నకు జవాబు తెలిసినా మౌనంగా మిన్నకుండిపోయారు. ఆ సమయంలో అధర్మం రాజ్యమేలుతోంది కాబట్టే సభ నిండా మౌనం ఆవహించింది. కనుకనే ఎవరెవరు ఎంతెంత మూల్యాన్ని చెల్లించారో భారతం చెప్పకనే చెప్పింది కదా!
‎మిత్ర ధర్మం పాటించిన కర్ణుడు.
‎మహాభారతంలో గొప్ప ఆదర్శవంతమైన స్నేహితులు చాలామంది వున్నారు. అందులో గొప్ప స్నేహితులు కర్ణుడు, దుర్యోధనుడు. ఒకానొక సందర్భంలో దుర్యోధనుడు కర్ణుడిని అంగ రాజ్యానికి రాజుగా చేసి పంచభూతాల సాక్షిగా తన స్నేహితునిగా ఈ ప్రపంచానికి పరిచయం చేసాడు. ఆ సమయంలో కర్ణుడు 
‎"బృహదబ్ధ మేఖలాఖిల 
‎మహీతల క్షత్రవర సమక్షమున మహా
‎మహిమాన్వితునిగా నన్నును
‎మహీశుగా జేసి తతి సమర్థత వెలయన్"...
‎"సమస్త భూమండలం లోని రాజుల సమక్షంలో నన్నెంతో గౌరవించి రాజుగా చేసావు. దీనికి ప్రతిగా నేనేమి చేయాలో చెప్పు?" అని అడిగాడు కర్ణుడు. "కలకాలం నీ స్నేహం కావాల"న్నాడు దుర్యోధనుడు. "అటులనే ఈ రోజు నుంచి మనం ఇరువురం స్నేహితులం. నువ్వు చెప్పినట్లు చేస్తాను" అన్నాడు కర్ణుడు. ఆనాటి నుంచి తన అంతరాత్మ హెచ్చరిస్తున్నా మనసు చంపుకొని మిత్రునికిచ్చిన మాట ప్రకారం ధుర్యోధనుడు చేస్తున్నవి చెడ్డ పనులు అని తెలిసినప్పటికీ కర్ణుడు ధుర్యోధనుడితో స్నేహం చేసాడు. ఏ ఒక్క నాడు కూడా దుర్యోధనుడు చేస్తున్నది తప్పు అని ఎదురు చెప్పలేదు. అసమాన ధైర్యసాహసాలు గల కర్ణుడు దుష్ట ఆలోచనల దుర్యోధనుడితో స్నేహం చేసాడు. చివరికి తన ప్రాణాలు కూడా కోల్పోయాడు. అది కర్ణుడి యొక్క గొప్పతనం. కర్ణుడు పాటించిన మిత్రధర్మం. తను నమ్మాడు. అవతల స్నేహితుడు చేస్తున్నది తప్పు అని తెలిసి కూడా చెప్పకుండా అతను చేసిన తప్పులకు బలైపోయాడు మిత్రధర్మాన్ని పాటించిన కర్ణుడు. దీనిని బట్టి మనం తెలుసుకునేదేమంటే అన్నిటికన్నా మిన్నయైనది ధర్మం అని.
‎మిత్రధర్మానికి గల ప్రాథాన్యత ఈ పాత్రద్వారా మనం తెలుసుకోవచ్చు.
‎
‎భారతంలో ఎఱ్ఱన వ్రాసిన అరణ్యపర్వంలోని ఐదవ ఆశ్వాసంలో గల ధర్మవ్యాధుడు, కౌశికుడు ల వృత్తాంతాన్ని గమనించండి..
‎లోకంలో మనల్ని కనిపెంచిన తల్లిదండ్రులే కనిపించే దైవాలు. వారిని ఎల్లప్పుడూ సేవించడమే పిల్లల ధర్మం. అన్ని ధర్మాల కన్నా ఉత్తమ ధర్మం అదే. 
‎ఎవరైనా సర్వజ్ఞత్వం పొందాలన్నా, విజ్ఞాన వంతుడు కావాలన్నా 
‎తల్లిదండ్రుల మాటకు ఎదురు చెప్పకపోవడం, వృద్ధులైన తల్లిదండ్రులను సేవించడం, తల్లిదండ్రుల అనుమతితో విద్యుక్త ధర్మాలను నిర్వర్తించాలంటూ కొడుకుగా తాను ఆచరిస్తున్న పుత్ర ధర్మం గురించి కౌశికునితో చెబుతూ
‎"జనని జనకుడు సద్గురుడ నలుడాత్ము
‎డనగ నియ్యేవురును నే గృహస్థుచేత 
‎సుగతి వాంఛ బ్రసాదితు లగుదురట్టి
‎వాడ సూవె ధర్మాత్ముండు వసుధ మీద.".,
‎ఈ భూమి పై పుణ్యాన్ని కోరే గృహస్థుడు తల్లి, తండ్రి, గురువు, అగ్ని, ఆత్మ అనే అయిదుగురిని పూజించి సంతోషపరచాలి. అలాంటి గృహస్థుడే ధర్మాత్ముడు అని చెప్పాడు. నీవు తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఎంత జ్ఞానం సంపాదించినా అది అంతయూ వ్యర్థమేనని ధర్మవ్యాధుడు చెప్పాడు.
‎అప్పుడు జ్ఞానోదయమైన కౌశికుడు భూమిపై నివసించే పదివేలమందిలో ఏ ఒక్కడైనా ధర్మాచరణకు పూనుకుంటాడో లేదో కానీ నువ్వు ప్రయత్న పూర్వకంగా ధర్మాన్ని ఆచరిస్తున్నావు. ఈ భూమియందు ధర్మ మార్గాన్ని మించినది లేదు అదియే సాటిలేనిదని కౌశికుడు అన్నాడు.
‎ఈ వృత్తాతం ద్వారా ధర్మ మార్గమే భూమియందు సాటిలేనిదని మనం గ్రహించాలి. 
‎ఈ విధంగా మహా భారతంలో మనం పాటించాల్సిన ధర్మానికి చెందినవి కోకొల్లలుగా వున్నాయి. వాటిని విజ్ఞులైన పెద్దల ద్వారా తెలుసుకోవాలి. 
‎మన నిత్య జీవితంలో ఆచరించాలి.
‎సనాతన ధర్మాన్ని మించిన సంపద మరొకటి లేదు.
‎
‎ధర్మార్థకామ్యమోక్షాలనే పురుషార్థాలను చతుర్విధ పురుషార్థాలుగా చెప్పారు నీతికోవిదులు. గమనించండి. భారతీయ జీవన విధానంలో యుగయుగాలుగా అనేక సందర్భాలలో ‘ధర్మాని’కే ప్రప్రథమ స్థానమిచ్చారు కదా!
‎ఆ తర్వాతే ‘అర్థం’ అంటే డబ్బు సంపాదనకు ప్రాధాన్యతనిచ్చారు పెద్దలు.
‎కానీ ఈనాడు  ధర్మాన్ని గాలికి వదిలేసారు.  "ధనంమూలమిదం జగత్ "అంటూ డబ్బు వెంట పరుగెడుతున్నారు. ధర్మం, అధర్మం, న్యాయం, అన్యాయం అనే మాటలు పక్కన పెట్టేసి ఎలాగైనా చంపో చచ్చో డబ్బు సంపాదించడమే ప్రధానంగా చేస్తున్నారు ఈ డబ్బు సంపాదనా విషయంలో తర తమ బేధాలు వదిలేసి అయినవాళ్ళనీ, కానీవాళ్ళని వదిలేసి చివరాఖరికి తన ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా బతికినంతకాలం డబ్బుల వేటలో చిక్కుకు పోతున్నాడు మనిషి నేటి కాలంలో. అందుకనే నేడు సమాజంలో ఇన్ని అస్తవ్యస్థలు, అనారోగ్య వాతావారణాలు, స్వార్దపూరిత మానవ సంబంధాలు పేట్రేగిపోతున్నాయి. దీనికి సరైన పరిష్కార మార్గం ప్రతి ఒక్కరూ సామాజిక నియమాలకు తలొగ్గి సనాతన ధర్మాన్ని పాటించడమే. 
‎
‎మనం మన పిల్లలకు ఆస్థులు, అంతస్థులు, భవనాలు, పొలాలు, కార్లు, ఏమీ సంపాదించి ఇవ్వనవసరం లేదు. సనాతన ధర్మాన్ని  ఆచరిస్తూ, పిల్లలకు ఆచరించమని చెప్పటమే ప్రతి తల్లీ తండ్రి తమ పిల్లలకు ఇచ్చే గొప్ప సంపద.
‎మరొకరి హక్కులకు భంగం కలిగించకూడదు. ఈ రకమైన కనీస ధర్మభావన పసితనంలోనే ప్రతి ఒక్కరి మనసులో స్థిరపడాలి. ఇందుకు తల్లిదండ్రులు, గురువులే ప్రథమ బాధ్యత తీసుకోవాలి. యుక్తవయసులో, ధనార్జన అవసరం ఏర్పడేలోగానే, ఉద్యోగ వృత్తులలో స్థిరపడే మార్గాలను అన్వేషించుకొనే క్రమంలోనే ఈ ధార్మిక వ్యకిత్వానికి పునాది పడాలి. 
‎ఆడంబరమైన, విలాసవంతమైన  స్వేచ్ఛాయుత జీవనశైలి అలవాటు పడే లోగానే పిల్లల్లో సనాతన ధర్మాలు, సాంప్రదాయాలు, మన ఆచార వ్యవహారాలు, జీవన విధానాలు, ఆహారవిహారాలు మొదలైనవి అలవరచాలి.
‎మనం గొప్ప ఆథ్యాత్మిక సంపదకు వారసులం, మన మాతృభూమి భారత భూమి వేద భూమి, కర్మ భూమి. ఇటువంటిభూమిలో జనియించిన మనమందరం ఎంతో గొప్ప సాంస్కృతిక, చారిత్రక, ఆథ్యాత్మిక వారసత్వానికి వారసులం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
‎
‎భావి భారత పౌరులైన వారందరికీ ఈ సద్గుణాలతో కూడిన ధర్మనిష్ఠను స్థిరపడేలా బాధ్యతగల వారంతా కృషి చేయాలి. అప్పుడు మాత్రమే ‘గుణాత్మక పౌరులు’ తయారు కాగలరు. ఇది చిన్నతనంలో విద్యార్జన సమయంలో జరగాలి. ఒకవేళ అలా కుదరనప్పుడు కనీసం యుక్త వయస్సులో అభ్యసించే ఉన్నత విద్యాభ్యాసంలోనైనా  ‘ధార్మిక జీవన ఆవశ్యకత’ను యువతరానికి బోధపరచగలగాలి. ఈ మేరకు సంబంధిత సిలబస్‌లలోనే మార్పులు అవసరం. ఇప్పటికే కొన్ని విశ్వవిద్యాలయాల వారు రామయాయణం, భారతం, భాగవతం, ఆధారంగా అందులో మహత్తరమైన పాత్రలను పాఠ్యాంశాలలో సిలబస్ గా పెట్టి బోధిస్తున్నారు. ఇది శుభ పరిణామం. మార్పు అనేది నీ ఇంటి నుండే మొదలవ్వాలి. మొక్కగా వున్నప్పుడే కావల్సిన తీరులో వంచితే చెట్టు అదే తీరుగా ఎదుగుతుంది.
‎అతిగారాబం, విపరీత ప్రేమ, తదితర కారణాల వలన చిన్నతనంలో వదిలేస్తే పెద్దయిన తర్వాత ఎన్న్నో దుష్పరిణామాలు, ఎన్నో ఇబ్బందులు బాధలు పడక తప్పదు కదా. 
‎ధర్మమార్గాన్ని అనుసరించేవారికి ఎందునా ఓటమి లేదు. ధర్మాన్ని పాటించేవాడికి సర్వే సర్వత్రా విజయం చేకూరుతుంది. ధర్మం ఎక్కడ వుంటుందో విజయం అక్కడే వుంటుంది. కాబట్టి సాధ్యమైనంతవరకూ మనం మన పిల్లలకు ధర్మం గురించి చెబుదాం. సాధ్యమైనంతవరకూ పాటిద్దాం.....
‎""యతో ధర్మస్తతో జయః" అనే ఋషి వాక్కును ప్రచారం చేద్దాం...