ఎన్టీఆర్ వీరాభిమాని, టీటీడీ మాజీ బోర్డు సభ్యుడు ఎన్టీఆర్ రాజు సంవత్సరీకం.. హాజరై నివాళులర్పించిన నందమూరి కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు
సూర్య ఆంధ్రప్రదేశ్ డెస్క్: స్వర్గీయ నందమూరి తారక రామారావుకు అత్యంత ఆప్తుడిగా, వీరాభిమానిగా గుర్తింపు పొందిన టీటీడీ మాజీ బోర్డు సభ్యుడు ఎన్టీఆర్ రాజు ప్రథమ వర్ధంతి కార్యక్రమం భావోద్వేగ వాతావరణంలో జరిగింది. ఆయన శివైక్యం చెంది ఏడాది పూర్తయిన సందర్భంగా కుటుంబ సభ్యులు నిర్వహించిన సంవత్సరీక కార్యక్రమానికి నందమూరి కుటుంబ సభ్యులతో పాటు తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు హాజరై ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నందమూరి కుటుంబ సభ్యులు నందమూరి మోహనకృష్ణ, నందమూరి రామకృష్ణ, నందమూరి మోహన రూప, తుమ్మల ప్రసన్నకుమార్ ప్రత్యేకంగా ఎన్టీఆర్ రాజు నివాసానికి చేరుకున్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. నందమూరి కుటుంబంతో ఎన్టీఆర్ రాజుకు ఉన్న అనుబంధాన్ని, అన్నగారి ఆశయాల సాధనలో ఆయన పోషించిన పాత్రను వారు గుర్తు చేసుకుంటూ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
ఎన్టీఆర్ అభిమాన సంఘాల నాయకుడిగా, టీటీడీ పాలకమండలి సభ్యుడిగా ఆయన అందించిన సేవలు ఎప్పటికీ చిరస్మరణీయమని నేతలు కొనియాడారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ బలోపేతం కోసం ఎన్టీఆర్ రాజు ఎంతో నిబద్ధతతో పనిచేశారని, ఆయన లేని లోటు పార్టీకి, అభిమానులకు తీరనిదని పేర్కొన్నారు.
ఈ సంవత్సరీక కార్యక్రమంలో టీటీడీ మాజీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్, టీటీడీ మాజీ జేఈవో శ్రీనివాస రాజు, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, నరసింహ యాదవ్‌తో పాటు పలువురు టీడీపీ కార్పొరేటర్లు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ రాజు చిత్రపటానికి పూలు చల్లి నివాళులర్పించిన నేతలు, ఆయన సేవా దృక్పథాన్ని స్మరించుకున్నారు.
Also Read: మెగా కుటుంబం నుంచి మరో యంగ్ హీరో సందడి.. ఘనంగా కొణిదెల పవన్ తేజ్ 'జంట' టైటిల్, ఫస్ట్ లుక్ లాంఛ్