ప్రస్తుత శీతాకాల వాతావరణంలో మూర్చ వ్యాధి రోగులు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ కృష్ణమూర్తి తెలియజేశారు. జనవిజ్ఞాన వేదిక నగర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం గిల్డ్ ఆఫ్ సర్వీస్ స్కూల్ నందు నిర్వహించిన ఉచిత మూర్చ వ్యాధి శిబిరానికి హాజరైన ఆయన మాట్లాడుతూ మూర్చ వ్యాధి పట్ల రోగులకు భయము ఆందోళన అవసరం లేదని డాక్టర్ల సూచన మేరకు మందులు వాడడంతోనే మనకున్నటువంటి జబ్బును నియంత్రణలో ఉంచుకోవచ్చు అని అన్నారు. ప్రస్తుతం శీతాకాలం అయినందున మిగిలిన రోజులతో పోల్చుకుంటే మరింతగా జాగ్రత్తలు అవసరమని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు.జెవివి నగర కమిటీ ఆధ్వర్యంలో అనేక ఏళ్లుగా ఈ శివరాన్ని నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ పి.ప్రసూన తెలిపారు. ఒకప్పుడు ఉమ్మడి అనంతపురం జిల్లాలో నగరంలో మాత్రమే నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ప్రస్తుతం జెవివి ఆధ్వర్యంలో హిందూపురం,కదిరి, రాయదుర్గం, గుత్తి లాంటి చోట్ల కూడా నిర్వహిస్తున్నట్లు ఆమె తెలియజేశారు.రోగులు క్రమం తప్పకుండా ఇక్కడ జరుగుతున్న శిబిరానికి హాజరై తమ ఆరోగ్యాన్ని పరీక్షించుకొని తమకు అవసరమైన మందులను తీసుకెళ్తున్నట్లు ఆమె తెలిపారు. ఈరోజు నిర్వహించిన ఈ కార్యక్రమంలో వంద మందికి పైగా హాజరైనట్లు కన్వీనర్ రామకృష్ణ తెలియజేశారు. కార్యక్రమంలో డాక్టర్ హరి కిషోర్, జెవివి నగర నాయకులు ఎస్. తిరుపాల్,ప్రసాద్ రెడ్డి, రామిరెడ్డి,మన్సూర్.శివచరణ్ నూర్ మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.