ఒకేరోజు బాక్సాఫీస్ పోరు.. మమ్ముట్టి 'ఓం' వర్సెస్ దుల్కర్ 'ఆకాశంలో ఒక తార'!
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: దక్షిణాది చిత్రసీమలో తండ్రీకొడుకుల సినిమాల మధ్య అరుదైన బాక్సాఫీస్ పోటీకి రంగం సిద్ధమైంది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటించిన ఓం, ఆయన తనయుడు దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఆకాశంలో ఒక తార చిత్రాలు ఒకే రోజున నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. సొంత భాషలో కాకుండా వేర్వేరు భాషల ప్రాజెక్టులతో వీరిద్దరూ బాక్సాఫీస్ వద్ద తలపడుతుండటం సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.
కోలీవుడ్ నటుడు ధనుష్ ప్రధాన పాత్రలో దర్శకుడు రాజ్‌కుమార్ పెరియస్వామి తెరకెక్కిస్తున్న యాక్షన్ డ్రామా చిత్రం ఓం. ఇందులో మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనుండగా, సాయి పల్లవి, శ్రీలీల ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్‌తో అంచనాలను పెంచింది. తమిళంతో పాటు ఇతర భాషల్లోనూ ఈ చిత్రంపై ఆసక్తి నెలకొంది.
మరోవైపు దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం తెలుగు చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత పవన్ సాధినేని దర్శకత్వంలో ఆయన నటించిన ఆకాశంలో ఒక తార చిత్రం విడుదలకు సిద్ధమైంది. వైజయంతి మూవీస్, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. తెలుగులో దుల్కర్‌కు ఉన్న విశేష ఆదరణ నేపథ్యంలో ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది.
నవంబర్ 20న థియేటర్లలో విడుదలవుతున్న ఈ రెండు చిత్రాల మధ్య పోటీపై సినీ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. తెలుగులో వరుస విజయాల జోరుతో దుల్కర్ సల్మాన్ ఆకట్టుకుంటారా లేక మమ్ముట్టి నటించిన ఓం చిత్రం ప్రేక్షకులను మెప్పిస్తుందా అనేది బాక్సాఫీస్ వద్ద తేలనుంది.
Also Read: అట్టహాసంగా ఆనంగి సర్పంచి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు