ఊరిని చెడిపేస్తున్న రాజకీయం.- ఓటు అమ్ముకోని ఊర్లో ఈ సారి నోట్ల పంపకాలు
తిరుపతి ప్రత్యేక ప్రతినిధి:
కొన్ని కుటుంబాలు ఓటుకు డబ్బు తీసుకోక పోవచ్చు. కానీ ఊరు మొత్తం డబ్బుకు అమ్ముడు పోకుండా ఓటు వేసే ఆదర్శ గ్రామాలు దేశంలో చాలా అరుదుగా కనిపిస్తాయి. ఇలాంటి జాబితాలో చిత్తూరు జిల్లా, పెనుమూరు మండలం దాసరాపల్లె కూడా నిన్నటి దాకా ఉండేది. తాజాగా ముగిసిన ఎన్నికల్లో రాజకీయం ఆ పల్లెను చెడిపే ప్రయత్నం చేసింది.
దాసరా పల్లి గ్రామానికి సుమారు రెండు వందల ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. 1816లో నల్లాబత్తుల పెద్ద ఇరగమ రెడ్డి ఇప్పటి అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం నల్లాబత్తినవారిపల్లె నుంచి వచ్చి ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఆయన 650 ఎకరాలకు ఇనాముదారుగా ఉంటూ గ్రామం నిర్మించి అభివృద్ధికి కృషి చేశారు. మొదట 10 ఇళ్ళతో ప్రారంభం అయిన ఆ గ్రామంలో ఇప్పుడు 90కి పై చిలుకు ఇళ్ళు, 260 ఓట్లు ఉన్నాయి.
ఆ ఊర్లో పెడకంటి రెడ్ల కుటుంబాలతో పాటు, రెండు బీసీ కుటుంబాలు ఉన్నాయి. దాసరా పల్లి గ్రామం చార్వాకాని పల్లె పంచాయతీ లో ఉండేది. అయితే ఈ ఎన్నికలకు ఈ పంచాయతీ మొత్తం పెనుమూరు పంచాయతీలో విలీనమైంది. పంచాయతీ రాజ్ వ్యవస్థ ఏర్పడిన తరువాత దాసరా పల్లెకు చెందిన పెద్ద ఇరగమ రెడ్డి మనవడు నల్లాబత్తుల బాలి రెడ్డి ఏకగ్రీవంగా మొదటి సర్పంచ్ అయ్యారు. ఆయన తరువాత బాలి రెడ్డి చిన్నాన్న చిన్న ఇరగమ రెడ్డి రెండు సార్లు, మరో చిన్నాన్న కుమారుడు నల్లాబత్తుల మునిరత్నం రెడ్డి మూడు సార్లు సర్పంచులుగా ఎన్నికయ్యారు. 1994 లో బాలి రెడ్డి చిన్న కుమారుడు డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి భార్య నల్లాబత్తుల రాధ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే వీరు ఎవరూ ఒక్క రూపాయి కూడా డబ్బు ఖర్చు పెట్టి సర్పంచ్ కాలేదు. ప్రస్తుతం ఈ కుటుంబం వారి కుమారుడు డాక్టర్ ఎన్ బి హర్షవర్ధన్ రెడ్డితో కలసి తిరుపతిలో ఉంటున్నారు.
చందాలు ఇచ్చి ఓటు వేశారు
1977 పార్లమెంటు ఎన్నికల్లో మాజీ ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు సహ విద్యార్థి స్వర్గీయ ఎన్.బి. మునిరత్నం రెడ్డి నాయకత్వంలో గ్రామస్తులు జనతా పార్టీకి మద్దతు తెలిపారు. గ్రామం లోని ప్రతి ఒక్కరూ తమ వంతుగా చందాలు వేసుకుని రూ.1,116 సేకరించారు. ఆ మొత్తాన్ని జనతా పార్టీ చిత్తూరు లోక్‌సభ అభ్యర్థి ఎన్.పి. చంగల్రాయ నాయుడుకు అందించి, ఆయనకు ఓటు వేశారు. అది కేవలం ఎన్నికల సంఘటన కాదు. ప్రజల రాజకీయ చైతన్యానికి, స్వచ్ఛంద భాగస్వామ్యానికి నిదర్శనం. ఆ గ్రామంలో ఎప్పుడూ డబ్బు తీసుకుని ఓటు వేసే సంస్కృతికి ప్రజలు లొంగిపోలేదు.
పోలింగ్‌లో పాల్గొనే ఓటర్లలో దాదాపు 90 శాతం మంది ఒకే పార్టీకి మద్దతు పలుకుతుంటారు. అది వారి రాజకీయ నిర్ణయం కావచ్చు. కానీ డబ్బుకు లొంగకుండా తమ నిర్ణయానికి కట్టుబడి ఉండటమే గర్వకారణం.
గ్రామ ప్రజల సమష్టి వ్యక్తిత్వం మాత్రం అమ్ముడుపోని ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచింది.
నోటు వచ్చింది
దాసరాపల్లిలో 90 పై చిలుకు ఇళ్ళు, సుమారు 260 ఓట్లు ఉన్నాయి. ఇటీవల ముగిసిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ తరపున ఓటుకు రూ 1000, వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపున ఓటుకు రూ 500 నేరుగా పంచి ఆ గ్రామంలోని ఓటర్లను కొనేందుకు రెండు పార్టీలు ప్రయత్నించాయి. ఊరిని చెడిపే ఈ ప్రయత్నంలో రెండు పార్టీలు 25 శాతం దాకా విజయం సాధించాయి. ధనవంతులే కాకుండా మధ్యతరగతి, కూలి చేసుకునే వారిలో కూడా మెజారిటీ కుటుంబాలు నోటును తిరస్కరించాయి. కానీ ఓటుకు రూ 1000 పంచిన పార్టీకి ఆ గ్రామంలో మెజారిటీ ఓట్లు రాలేదు. రూ 500 పంచిన పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి 70 ఓట్ల మెజారిటీతో గెలిచారు.
జెడ్పీటీసీ అభ్యర్థి 184 ఓట్లతో విజయం సాధించారు. ఈ ఇద్దరి విజయంలో ఆ ఊరి ఓట్లు కీలకమయ్యాయి. రాజకీయ పార్టీలు తమ ప్రయోజనాల కోసం ఇలాంటి ఊర్లను చెడిపే ప్రయత్నాలు చేయడం బాధాకరం.
ఎస్.నగేష్ ప్రత్యేక ప్రతినిధి