ఈ నెల 19న నెల్లూరులో జిల్లాస్థాయి పారా క్రీడా ఎంపికలు - డి ఈ వో బాలాజీరావు
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం (డిసెంబర్ 3) సందర్భంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్ ) ఆధ్వర్యంలో ఈ నెల 19వ తేదీన నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జిల్లాస్థాయి పారా క్రీడా ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి డా. రాజా బాలాజీ రావు తెలిపారు. 13 సంవత్సరాలు పైబడిన ప్రత్యేక అవసరాలు కలిగిన బాలబాలికలు ఈ ఎంపికల్లో పాల్గొనేందుకు అర్హులని పేర్కొన్నారు. పారా అథ్లెటిక్స్, పారా బ్యాడ్మింటన్, వీల్‌చైర్ ఫెన్సింగ్, బ్లైండ్ గోల్‌బాల్, పారా తైక్వాండో, టేబుల్ టెన్నిస్ (బాలురు, బాలికలు) విభాగాల్లో క్రీడా ఎంపికలు నిర్వహించనున్నట్లు తెలిపారు.జిల్లాలోని అన్ని మండలాల నుంచి అర్హులైన ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులను గుర్తించి, ఈ క్రీడా ఎంపికల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలని డిప్యూటీ విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. ప్రతి మండలం నుంచి బాలబాలికలు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని, అన్ని ఆరు క్రీడా విభాగాల్లోనూ ప్రతిభ కలిగిన విద్యార్థులకు అవకాశం కల్పించాలని సూచించారు.ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీయడంతో పాటు, వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి, రాష్ట్ర మరియు జాతీయ స్థాయి పారా క్రీడల్లో రాణించేలా ప్రోత్సహించడమే ఈ ఎంపికల ప్రధాన లక్ష్యమని తెలిపారు.మరిన్ని వివరాల కోసం జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి (డి ఎస్ డి వో ) ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం, నెల్లూరును సంప్రదించాలని జిల్లా విద్యాశాఖాధికారి డా. రాజా బాలాజీ రావు తెలిపారు.