ఎమ్మెల్యే గౌరు చరిత సమక్షంలో వైసీపీ నుంచి టీడీపీలోకి 50 కుటుంబాలు
కర్నూలు నవంబర్ 17:
పాణ్యం నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పాణ్యం శాసనసభ్యురాలు గౌరు చరిత రెడ్డి సమక్షంలో గుడుంబాయి తండాకు చెందిన సుమారు 50 కుటుంబాలు వైఎస్సార్‌సీపీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరాయి. తండా మాజీ సర్పంచ్ ఎన్. శీను నాయక్, ఆయన సతీమణి దీప్తి బాయి నాయకత్వంలో ఈ భారీ చేరికలు జరిగాయి. పార్టీలో చేరిన వారందరికీ ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి పసుపు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల్లో మంచి ఆదరణ ఉన్న బలమైన నాయకుడు శీను నాయక్ టీడీపీలో చేరడం పార్టీకి ఎంతో బలాన్ని చేకూరుస్తుందని హర్షం వ్యక్తం చేశారు. ఆయన రాకతో గుడుంబాయి తండాలో పార్టీ మరింత బలోపేతం అవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
పార్టీని నమ్ముకుని వచ్చిన ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం ఉంటుందని ఆమె భరోసా ఇచ్చారు.
అనంతరం మాజీ సర్పంచ్ శీను నాయక్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి, సీనియర్ నాయకుడు గౌరు వెంకట రెడ్డిల నాయకత్వంపై పూర్తి నమ్మకంతోనే తాను టీడీపీలో చేరినట్లు స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు, అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై తన అనుచరులతో కలిసి పసుపు కండువా కప్పుకున్నట్లు వివరించారు. గుడుంబాయి తండా అభివృద్ధికి, అక్కడి ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. తనతో పాటు పార్టీలో చేరిన 50 కుటుంబాలకు తగిన గుర్తింపు, గౌరవం దక్కేలా చూసుకుంటూ పార్టీ అభ్యున్నతికి అందరం కలిసికట్టుగా పనిచేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ భారీ చేరికలతో తండాలో టీడీపీకి మరింత బలం చేకూరిందని పార్టీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేశాయి.