పాలకుర్తిలో రైతు సదస్సు – వ్యవసాయ ప్రదర్శన
కోడుమూరు మేజర్ న్యూస్ : కోడుమూరు మండలంలోని పాలకుర్తి గ్రామంలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన మహానంది వ్యవసాయ కళాశాల విద్యార్థినీ విద్యార్థులు రైతు సదస్సు, వ్యవసాయ ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామీణ వ్యవసాయ పని అనుభవ కార్యక్రమంలో భాగంగా ఈ సదస్సును ఏర్పాటు చేశారు.
వ్యవసాయ కోర్సులో మూడేళ్ల విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థులు ఆరు నెలల పాటు గ్రామాల్లో రైతుల మధ్య ఉంటూ వ్యవసాయ క్షేత్రస్థాయిలో అనుభవం పొందే కార్యక్రమంలో భాగంగా పాలకుర్తి గ్రామాన్ని ఎంపిక చేసుకున్నారు. ఈ ఆరు నెలల కాలంలో గ్రామంలోని రైతులతో మమేకమై వివిధ రకాల పంటల సాగు విధానాలు, సమస్యలు, దిగుబడి పెంపు మార్గాలు, ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన పెంపొందించుకున్నారు.
ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు రైతులకు వ్యవసాయంపై పలు సలహాలు, సూచనలు అందించడంతో పాటు రైతుల నుంచి కూడా సాగులో ఎదురవుతున్న సమస్యలు, అనుభవాలు, సూచనలను తెలుసుకున్నారు. రైతుల అనుభవాలను, శాస్త్రీయ పరిజ్ఞానాన్ని సమన్వయం చేసుకుంటూ తమ వ్యవసాయ విద్యను పూర్తిచేసుకునే దిశగా ఈ కార్యక్రమం దోహదపడింది.
కార్యక్రమంలో ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి. సుజాతమ్మ, కర్నూలు డివిజన్ ఏడీఏ జి.ఎం. అల్తాఫ్ అలీ ఖాన్, మహానంది వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ సతీష్ కుమార్, వ్యవసాయ అధికారి, రైతు సేవా కేంద్రం సిబ్బంది, గ్రామ రైతులు, గ్రామ పెద్దలు, వ్యవసాయ కళాశాల విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ రైతు సదస్సు, వ్యవసాయ ప్రదర్శన ద్వారా రైతులకు శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించడంతో పాటు విద్యార్థులకు క్షేత్రస్థాయి వ్యవసాయ అనుభవం లభించింది.