ఆక్వాన్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి-అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్
అవనిగడ్డ, మేజర్ న్యూస్: ఆక్వాన్ తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సూచించారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తుఫాన్ ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు వ్యవసాయ శాఖ సూచనలు పాటించాలని కోరారు. డ్రైనేజీ శాఖ అధికారులు, నీటి సంఘాల ప్రతినిధులు సమిష్టిగా పనిచేసి మురుగునీటి పారుదలకు ఎక్కడైనా అడ్డంకులు ఏర్పడి ఉంటే వాటిని తొలగించాలని సూచించారు. ఎల్-నీనో పరిస్థితిలోనూ ప్రణాళికతో సాగు చేసిన పంటను కాపాడుకునేందుకు వర్షపునీరు ఎప్పటికప్పుడు మురుగుబోదులకు మళ్లించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. తుఫాన్ దిశ మార్చుకుంటే వీచే గాలులకు ప్రమాదాలకు గురికాకుండా ప్రజలు తుఫాను తీరం దాటే సమయంలో బయటకు రావద్దని సూచించారు. అధిక వర్షాలు కురిస్తే లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అధికారులు తగిన సన్నాహాలు చేయాలన్నారు. ప్రధానంగా మత్స్యకారులు, రైతులు, బలహీన గృహాల ప్రజలు అధికారుల సూచనలు పాటించాలని సూచించారు.✍️ అజంతా శ్రీనివాస్, అవనిగడ్డ, కృష్ణాజిల్లా.