కంది,వరి పంటలపై శాస్త్రవేత్తల క్షేత్రస్థాయి పరిశీలన
దుర్గి మండలంలోని ధర్మవరం, ఓబులేసుపల్లి గ్రామాల్లో సోమవారం డీడీఏ ఎఫ్‌టీసీ సి. పద్మావతి ఆధ్వర్యంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో రైతులు సాగు చేస్తున్న కంది, వరి పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, పంటల ప్రస్తుత పరిస్థితులను సమీక్షించారు. అధిక దిగుబడులు సాధించేందుకు పాటించాల్సిన శాస్త్రీయ యాజమాన్య పద్ధతులు, తెగుళ్లు, పురుగుల నివారణ చర్యలపై రైతులకు అవగాహన కల్పించారు.కంది పంటలో మొక్కల పెరుగుదలతో పాటు నీటి ఎద్దడిని తట్టుకునే సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ఎకరాకు 500 మి.లీ. పీపీఎఫ్ఎం బ్యాక్టీరియాను పిచికారీ చేయాలని సూచించారు. మొక్కల పెరుగుదల దశలో ఒకసారి, పూత దశలో మరోసారి పిచికారీ చేయడం వల్ల మొక్కల ఎదుగుదలకు, పర్యావరణ ఒత్తిళ్లను తట్టుకునేందుకు దోహదపడుతుందని వివరించారు. పూత, కాయలను ఆశించే పురుగుల ఉధృతిని ఎప్పటికప్పుడు గమనించాలని, ఆర్థిక నష్ట పరిమితి దాటినప్పుడే శాస్త్రవేత్తలు సూచించిన పురుగుమందులను సరైన మోతాదులో వినియోగించాలని తెలిపారు.
వరి పంటలో కాండం తొలిచే పురుగు నివారణకు పొట్ట దశ నుంచి పంటను నిశితంగా పరిశీలించాలని సూచించారు. పురుగు ఆశించిన లక్షణాలు కనిపించినప్పుడు ఉధృతిని బట్టి సిఫార్సు చేసిన మందులను మాత్రమే పిచికారీ చేయాలని, అనవసరంగా పురుగుమందులు వినియోగించవద్దని రైతులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో డీడీఏ ఎఫ్‌టీసీ సి. పద్మావతి, అమరావతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జి. బిందు మాధవి, డాట్ సెంటర్ శాస్త్రవేత్తలు డాక్టర్ నగేష్, డాక్టర్ సత్య గోపాల్, దుర్గి మండల వ్యవసాయ అధికారి వై. అమీర్ రెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారి కె. రంగనాయక్, గ్రామ వ్యవసాయ సహాయకుడు అశోక్, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు సూచించిన పద్ధతులను రైతులు పాటించి సమగ్ర పంటల యాజమాన్యం ద్వారా అధిక దిగుబడులు సాధించాలని అధికారులు కోరారు. పేర్ల వెంకటేశ్వర్లు సీనియర్ రిపోర్టర్ దుర్గి