'ఐ హేట్ మ్యారేజ్' ట్రైలర్ రిలీజ్.. నేటి తరం యువత ఆలోచనలతో ఆకట్టుకుంటోంది!
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: సుగి విజయ్, జుప్సీ భద్ర జంటగా నటిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ చిత్రం ఐ హేట్ మ్యారేజ్ ట్రైలర్‌ను చిత్రబృందం సోమవారం విడుదల చేసింది. జుప్సీ భద్ర ఈ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమవుతున్నారు. పరమేష్ రేణు కుంట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఆర్య సినిమా పతాకంపై మాదం దయానంద్, కార్తీక్ వెంపటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించగా, తాజా ట్రైలర్ నేటి తరం యువతకు కనెక్ట్ అయ్యేలా ఉందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సినిమా ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ట్రైలర్ విడుదల సందర్భంగా దర్శకుడు పరమేష్ రేణు కుంట్ల మాట్లాడుతూ, ప్రేమ, పెళ్లి, కెరీర్‌తో పాటు స్వతంత్రంగా జీవించాలనే నేటి జెన్ జీ తరం ఆలోచనలు, భావజాలాన్ని వాస్తవానికి దగ్గరగా చూపించే ప్రయత్నం చేశామని తెలిపారు. ప్రతి సన్నివేశం సహజంగా ఉంటుందని, ఎలాంటి సినిమాటిక్ అతిశయోక్తులు లేకుండా యువత ఎదుర్కొనే నిజ జీవిత భావోద్వేగాలు, నిర్ణయాలను తెరపై ఆవిష్కరించామని చెప్పారు. కొత్త తరహా చిత్రాలను ఆదరించే తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు.
ఈ చిత్రానికి ప్రముఖ ఛాయాగ్రాహకుడు విజయ్ సి కుమార్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించారు. సుగి విజయ్, జుప్సీ భద్రలతో పాటు హారిక రాజేందర్, సాహితి కృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
పృథ్వీరాజ్, రవివర్మ అడ్డూరి, ప్రభావతి, ఆశ్రిత వేముగంటి, లోహిత్ కుమార్, బేబి తమోఘ్న, రాధ రాయసం, లక్ష్మి, జాకీర్, విజయ్ కుమార్, దాసరి పద్మ రేఖ, శ్రీదేవి ఆర్రోజు, మెయిల్ రమేష్, అరుణ్ కుమార్ రెడ్డి, ఇందు, అఖండ సుధాకర్ రెడ్డి తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. నవంబర్ 27న థియేటర్లలో విడుదలవుతున్న ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.