పెద్ద కలలు, ప్రేమ, ఊహించని మలుపులు.. 'టీన్ తిగడా' ట్రైలర్ రిలీజ్!
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: యువతలో ఉండే కలలు, ఆశయాలు, ప్రేమ, జీవితంలో ఎదురయ్యే అనూహ్య మలుపుల నేపథ్యంలో రూపొందిన వెబ్ సిరీస్ టీన్ తిగడా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. సంగీతం, క్రికెట్ నేపథ్యంగా సాగే ఈ కథలో యువత తమ లక్ష్యాలను చేరుకునేందుకు చేసే ప్రయత్నాలు, అనుబంధాలు, సవాళ్లను ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. ప్రసన్న బిష్ట్, దనేష్ రజ్వీ, అర్చిక అరోరా, సమర్థ్ మెహతా, గ్రుషా కపూర్ కీలక పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌ను స్ట్రీట్‌ల్యాంప్ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్ఎల్‌పీ, ఐ స్క్రీమ్ డ్రీమ్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ సిరీస్ నవంబర్ 20 నుంచి ఓటీటీ వేదికపై స్ట్రీమింగ్ కానుంది.
విడుదలైన టీజర్, ట్రైలర్ యువత జీవితంలోని భావోద్వేగాలు, లక్ష్యాలను ఆవిష్కరిస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. క్రికెటర్ కావాలని కలలు కనే అస్మాని, సింగర్‌గా గుర్తింపు తెచ్చుకోవాలని తపించే మానస్ మధ్య ప్రేమ చిగురించడం, ఆ తర్వాత అనుకోకుండా ఎదురయ్యే గర్భధారణ పరిస్థితి వారి జీవితాలను ఒక్కసారిగా మార్చివేయడం వంటి అంశాలు ట్రైలర్‌లో ఆకట్టుకుంటున్నాయి. కలలు, ప్రేమ, కొత్త బాధ్యతల మధ్య ఆ జంట ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది, వారి భవిష్యత్తు ఏ మలుపు తిరిగింది అనేది ఆసక్తికరంగా రూపొందించారు.
ట్రైలర్ విడుదల సందర్భంగా నటి ప్రసన్న బిష్ట్ మాట్లాడుతూ, మనం ఒకలా ప్లాన్ చేస్తే జీవితం మరోలా తీసుకెళ్తుందని, అలాంటి అనుకోని పరిస్థితులను అర్థం చేసుకుని ధైర్యంగా ముందుకు సాగడం ఈ కథలో ప్రత్యేకమని చెప్పారు. ప్రేమ, హాస్యం, భావోద్వేగాలతో యువతకు ఈ సిరీస్ బాగా కనెక్ట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.
నటుడు దనేష్ రజ్వీ మాట్లాడుతూ, జీవితంలో ఊహించని ఘటనలు ఎదురైనప్పుడు బంధాలు ఎలా మారుతాయి, ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందనే విషయాలను ఇందులో చూపించారని తెలిపారు. భావోద్వేగాలు, సరదా సన్నివేశాల మేళవింపుతో రూపొందిన టీన్ తిగడా ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుందని చిత్రబృందం ఆశాభావం వ్యక్తం చేసింది.