ఏఐ నటుడితో ఏకలవ్య వెబ్ సిరీస్.. లయన్స్‌గేట్ ప్లే సరికొత్త అడుగు
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: కృత్రిమ మేధ సాంకేతికత సినీ, ఓటీటీ రంగాల్లో సరికొత్త మైలురాయిని దాటుతోంది. ఇప్పటివరకు విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్, పోస్ట్ ప్రొడక్షన్ వంటి విభాగాలకే పరిమితమైన ఏఐ, ఇప్పుడు ఏకంగా ప్రధాన పాత్రధారిగా ప్రేక్షకుల ముందుకు వస్తుండటం విశేషం. మహాభారత ఇతిహాసంలోని శక్తివంతమైన విలుకాడు ఏకలవ్యుడి గాథ ఆధారంగా రూపొందుతున్న ఏకలవ్య వెబ్ సిరీస్‌లో తొలిసారిగా ఏఐ నటుడిని పరిచయం చేస్తున్నారు. ప్రముఖ ఓటీటీ వేదిక లయన్స్‌గేట్ ప్లే ఈ ప్రాజెక్టును ప్రకటించగా, ఏకలవ్య పాత్రలో నటించే ఏఐ నటుడికి యుగ్ ఆర్. ఏఐ అని పేరు పెట్టారు.
ఈ వెబ్ సిరీస్‌కు విభు పురి దర్శకత్వం వహిస్తున్నారు. ఏకలవ్య పాత్రలో యుగ్ ఆర్. ఏఐ చేతిలో విల్లు, వీపుపై అమ్ములపొదితో సూర్యకాంతి నేపథ్యంలో నిలబడి ఉన్న ఫస్ట్ లుక్‌ను లయన్స్‌గేట్ ప్లే వ్యవస్థాపకుడు, సీఈఓ రోహిత్ జైన్ విడుదల చేయగా, అది సోషల్ మీడియాలో ఆసక్తిని రేపుతోంది. భారతీయ పౌరాణిక గాథలను భారీ బడ్జెట్, షెడ్యూల్ పరిమితుల కారణంగా తెరపై పూర్తిస్థాయిలో చూపించలేకపోయే పరిస్థితులకు ఏఐ సాంకేతికత చెక్ పెడుతుందని నిర్వాహకులు భావిస్తున్నారు. ఇప్పటివరకు బడ్జెట్‌లు, షెడ్యూళ్లకు తగ్గట్టుగా ఆలోచనలను కుదించుకుంటూ వచ్చామని, కానీ ఏకలవ్యతో తొలిసారిగా ఊహకు తగ్గంత విస్తృతమైన కాన్వాస్ లభించిందని దర్శకుడు విభు పురి తెలిపారు.
ఈ సిరీస్ నిర్మాణం కోసం లయన్స్‌గేట్ ప్లే సంస్థ గూగుల్ క్లౌడ్‌తో దీర్ఘకాలిక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. గూగుల్ క్లౌడ్ ఏఐ సాంకేతికత సహాయంతో క్యారెక్టర్ రూపకల్పన, యానిమేషన్, ఇతర సాంకేతిక ప్రక్రియలను వేగవంతంగా పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ ప్రాజెక్టును ఎనిమిది ఎపిసోడ్లతో రూపొందిస్తుండగా, భవిష్యత్తులో మరిన్ని సీజన్లలో విస్తరించేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం.
ఏకలవ్య వెబ్ సిరీస్ 2027లో స్ట్రీమింగ్‌కు రానుంది. లయన్స్‌గేట్ ప్లే యాప్‌లోని టైగర్ టీవీ విభాగంలో ఈ సిరీస్ ప్రీమియర్ కానుండగా, ఏఐ ఆధారిత ఒరిజినల్ కంటెంట్ శ్రేణిలో ఇది మొదటి ప్రాజెక్టుగా నిలవనుంది. సంప్రదాయ నటనకు భిన్నంగా పూర్తిగా డిజిటల్, కృత్రిమ మేధ సాయంతో రూపొందుతున్న ఈ ప్రయోగం ఓటీటీ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.