నవంబర్ 30లోగా రైతులకు సవరించిన అడంగల్ కాపీలను రిజిస్టర్డ్ పోస్టు ద్వారా ఇంటి వద్దకే పంపిణీ* *మ్యుటేషన్ దరఖాస్తుల్లో ప్రస్తుత పోస్టల్ చిరునామాను సరిగ్గా, పూర్తిగా, తప్పనిసరిగా నమోదు చేయాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి*
కర్నూలు, నవంబర్ 25:- జిల్లాలో భూముల మ్యుటేషన్‌కు సంబంధించి ఆమోదించి సవరించిన అడంగల్ కాపీలను ఈ నెల 30వ తేదీలోగా రిజిస్టర్డ్ పోస్టు ద్వారా నేరుగా రైతుల ఇంటి వద్దకే పంపిణీ చేసే విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
సీసీఎల్ఏ ఆదేశాల మేరకు మ్యుటేషన్ ఫర్ ట్రాన్సాక్షన్స్, మ్యుటేషన్ ఫర్ కరెక్షన్స్ కింద దరఖాస్తు చేసుకున్న వారికి తహసీల్దార్లు దరఖాస్తులను ఆమోదించిన వెంటనే సవరించిన అడంగల్ కాపీలను రిజిస్టర్డ్ పోస్టు ద్వారా అందజేసేలా చర్యలు తీసుకునేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ నెల 30వ తేదీ వరకు పోస్టల్ శాఖ సహకారంతో ఆమోదించి సవరించిన అడంగల్ కాపీలను సంబంధిత దరఖాస్తుదారుల ఇంటి చిరునామాలకు రిజిస్టర్డ్ పోస్టు ద్వారా పంపిణీ చేసే ప్రక్రియను తహశీల్దార్లు పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. రైతులకు రెవెన్యూ సేవలను మరింత చేరువ చేయడం, భూ రికార్డుల సవరణ అనంతరం సంబంధిత పత్రాలను సకాలంలో వారి ఇంటి వద్దకే అందించడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని కలెక్టర్ పేర్కొన్నారు. మ్యుటేషన్ దరఖాస్తుల సమయంలో స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాలలోని డిజిటల్ అసిస్టెంట్లు దరఖాస్తుదారుల ప్రస్తుత నివాస చిరునామాను సరిగ్గా, పూర్తి వివరాలతో తప్పనిసరిగా నమోదు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రస్తుత చిరునామా వివరాలను పూర్తిగా డోర్ నంబర్, వీధి పేరు, జిల్లా, మండలం/మున్సిపాలిటీ, గ్రామం/వార్డు, పోస్టాఫీస్, పిన్‌కోడ్ తదితర వివరాలను తప్పులు లేకుండా ఖచ్చితంగా నమోదు చేయాలన్నారు..ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు తహసీల్దార్లు పోస్టల్ శాఖ అధికారులతో, VRO, VRAలతో సమన్వయం చేసుకోవాలన్నారు. స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాలను సందర్శించి దరఖాస్తుల్లో సరైన పోస్టల్ చిరునామాలు నమోదవుతున్నాయో లేదో క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాలని కలెక్టర్ రెవెన్యూ డివిజనల్ అధికారులను, తహసీల్దార్లను ఆదేశించారు.. అడంగల్ కాపీల పంపిణీని తహసీల్దార్లు నిరంతరం పర్యవేక్షించాలని, రెవెన్యూ డివిజనల్ అధికారులు మండలాలను సందర్శించి పంపిణీ ప్రక్రియను పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు. స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాల ద్వారా ఈ కార్యక్రమం పై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ తెలిపారు. మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న రైతులు తమ ప్రస్తుత పోస్టల్ చిరునామా వివరాలు సరిగ్గా నమోదయ్యేలా చూసుకోవాలని, పోస్టు ద్వారా అందే సవరించిన అడంగల్ కాపీలను స్వీకరించాలని కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు..