అట్రాసిటీ కేసుల్లో స్టేషన్ బెయిల్ రద్దు చేయాలి
నవాబుపేట సూర్య న్యూస్: అట్రాసిటీ చట్టం కింద నమోదైన కేసుల్లో స్టేషన్ బెయిల్ మంజూరు చేసే విధానాన్ని రద్దు చేయాలని సిటిజన్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ (సీవీఎంసీ)కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేసింది.బుధవారం మండల కేంద్రంలోని పాత గ్రామపంచాయతీ ఆవరణలో సిటిజన్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా దళిత బహుజన రాష్ట్ర కమిటీ సభ్యులు కొంగల్ల శాంతయ్య,జిల్లా కార్యదర్శి సి.ఆనంద్ హాజరై కమిటీ సభ్యులతో పలు అంశాలపై చర్చించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..2026సంవత్సరంలో మండల పరిధిలో అట్రాసిటీ చట్టం కింద ఆరు కేసులు నమోదైనట్లు కమిటీ దృష్టికి వచ్చిందన్నారు.అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదైన అనంతరం నిందితులకు పోలీస్ స్టేషన్‌లోనే బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తెలుస్తోందని,ఈ విధానాన్ని రద్దు చేయాలని కమిటీ తీర్మానించినట్లు తెలిపారు.ఏడు సంవత్సరాలకు పైబడిన శిక్షకు సంబంధించిన నేరాలు,ఏడు సంవత్సరాల లోపు శిక్షకు సంబంధించిన నేరాల విషయంలో బెయిల్ నిబంధనలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ,ఆ తీర్పు అట్రాసిటీ చట్టానికి వర్తిస్తుందా లేదా అనే అంశంపై స్పష్టత అవసరమని కమిటీ అభిప్రాయపడింది.అట్రాసిటీ కేసుల్లో స్టేషన్ బెయిల్ విధానాన్ని రద్దు చేసేలా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తూ సమావేశంలో తీర్మానం చేశారు.ఈ కార్యక్రమంలో కమిటీ కన్వీనర్ కొంగల్ల కృష్ణ,కో-కన్వీనర్లు నర్సింహులు,మునేష్,బాలయ్య,వెంకటయ్య,వెంకటమ్మ,రాములు,శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.