యువత లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణతో కృషి చేయాలి*
*యువత లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణతో కృషి చేయాలి*
*యువతలోని ప్రతిభను ప్రోత్సహిస్తూ ...ఉపాధి, నైపుణ్య అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి*
*జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి*
*యువతలోని నైపుణ్యాలు, సృజనాత్మకతను వెలికితీయడమే లక్ష్యం*
*2047 నాటికి అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలి*
*పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి*
కర్నూలు, అక్టోబర్ 1:యువత తమ అభిరుచి, సామర్థ్యాలకు అనుగుణంగా స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని, క్రమశిక్షణతో నిరంతరం కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి సూచించారు. యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి ప్రోత్సహించడంతో పాటు, ప్రభుత్వం కల్పిస్తున్న ఉపాధి, నైపుణ్యాభివృద్ధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని కలెక్టర్ ఆకాంక్షించారు.
గురువారం జిల్లా యువజన సంక్షేమ శాఖ–సెట్కూరు ఆధ్వర్యంలో దూపాడులోని అశోక మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన జిల్లా యువజనోత్సవాలను జిల్లా కలెక్టర్, పాణ్యం ఎమ్మెల్యే, జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ....జిల్లా యువజనోత్సవాలను పురస్కరించుకుని జిల్లా యువతకు జిల్లా శుభాకాంక్షలు తెలిపారు. స్వామి వివేకానంద జీవితం, ఆలోచనలు, దేశం పట్ల ఆయన చూపిన అంకితభావం యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయి యువజనోత్సవాల్లో కర్నూలు జిల్లా యువత అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అవార్డులు సాధించాలని ఆకాంక్షించారు. యువతలో దాగి ఉన్న సాంస్కృతిక ప్రతిభ, సృజనాత్మకత, ఐక్యత, సమైక్యత భావనలను వెలికితీయడమే యువజనోత్సవాల ప్రధాన ఉద్దేశమని కలెక్టర్ తెలిపారు. యువత భవిష్యత్‌లో సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు. జీవితంలో ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు తదితర సవాళ్లు ఎదురైనా వాటిని అధిగమించి నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించే దిశగా యువత ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ సూచించారు. హార్డ్ వర్క్, క్రమశిక్షణ, పట్టుదలతో పనిచేస్తే లక్ష్యాలను సాధించవచ్చని తెలిపారు. ప్రస్తుత యువత సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, సమయాన్ని వృథా చేసుకుంటే భవిష్యత్‌లో పశ్చాత్తాపపడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఉద్యోగం, వ్యాపారం లేదా తమకు ఆసక్తి ఉన్న ఏ రంగంలోనైనా కష్టపడి పనిచేసి స్వయం అభివృద్ధి సాధించాలని సూచించారు. యువత శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యంపైనా ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ సూచించారు. పోషకాహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అలవాటుగా చేసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా యువతులు ఆరోగ్యాన్ని దెబ్బతీసే విధంగా ఆహారాన్ని పూర్తిగా తగ్గించడం వంటి పద్ధతులకు దూరంగా ఉండాలని, ఆహారం–వ్యాయామం విషయంలో సమతుల్యత పాటించాలని సూచించారు. ఇతరుల విజయాలను చూసి అసూయ, ఈర్ష్య, ద్వేషం పెంచుకోకుండా ప్రతి ఒక్కరి పట్ల సానుకూల దృక్పథంతో ఉండాలని తెలిపారు. ఇతరులు అభివృద్ధి చెందితే సంతోషించే మనస్తత్వం కలిగి ఉండటం ద్వారా మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవచ్చని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ కలలను పిల్లలపై రుద్దకుండా, పిల్లల్లో ఉన్న ఆసక్తి, ప్రతిభ, బలాలు, అభిరుచులను గుర్తించి వారికి తగిన రంగంలో ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు. పిల్లలు ఆసక్తి ఉన్న రంగంలో పనిచేసినప్పుడు ఉత్సాహంతో, ఆనందంగా ముందుకు సాగగలరని తెలిపారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు కేవలం విద్యాబోధనకే పరిమితం కాకుండా రెండో తల్లిదండ్రులుగా వారికి మానసిక ధైర్యం, ప్రోత్సాహం అందించాలని కోరారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేలా ఉపాధ్యాయులు సహకరించాలని సూచించారు.
*యువత నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి*
జిల్లాలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పరిశ్రమల స్థాపనతో పాటు జాబ్ మేళాలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. నైపుణ్యం పోర్టల్‌ను యువత సద్వినియోగం చేసుకుని తమ విద్యార్హతలు, నైపుణ్యాలు, రెస్యూమ్ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. జిల్లాలో నిర్వహిస్తున్న జాబ్ మేళాల ద్వారా యువతకు వివిధ పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. అమరరాజా బ్యాటరీస్ సంస్థ ద్వారా ఇటీవల ఒకే రోజులో 226 మందికి నియామక అవకాశాలు కల్పించామని, మరింత మందికి ఉపాధి కల్పించే దిశగా అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. విద్యార్హతలు తక్కువగా ఉన్న యువతకు కూడా అందుబాటులో ఉన్న ఉద్యోగ, నైపుణ్యాభివృద్ధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ముఖ్యంగా యువతులు విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి రంగాల్లో ముందుకు సాగి ఆర్థికంగా స్వావలంబన సాధించాలని కలెక్టర్ ఆకాంక్షించారు. తల్లిదండ్రులు కూడా కుమార్తెలను కేవలం వివాహం చేయాల్సిన బాధ్యతగా చూడకుండా, వారు తమ కాళ్లపై తాము నిలబడేలా ప్రోత్సహించాలని సూచించారు. యువతులు తమ ప్రతిభతో స్వయం ఉపాధి లేదా ఉద్యోగం ద్వారా ఆర్థిక స్వాతంత్ర్యం సాధించి, ఇతరులకు కూడా ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని కోరారు.
*సామాజిక సేవలో యువత భాగస్వామ్యం కావాలి*
యువత సామాజిక బాధ్యతలో భాగంగా రక్తదానం, మొక్కల పెంపకం, స్వచ్ఛత కార్యక్రమాలు వంటి సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని కలెక్టర్ సూచించారు. కళాశాలల్లో సీడ్ బాల్స్ వేయడం, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపట్టాలని తెలిపారు. తుంగభద్ర నది పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు యువత, విద్యార్థులు, కళాశాలలతో కలిసి ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుందని సూచించారు. జిల్లా యువజనోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేసిన కళాశాల యాజమాన్యం, సెట్కూర్ సిబ్బందికి జిల్లా కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు.
*యువతలోని నైపుణ్యాలు, సృజనాత్మకతను వెలికితీయడమే లక్ష్యం*
*ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలి*
ఈ సందర్భంగా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ.... యువతలో దాగి ఉన్న నైపుణ్యాలు, ప్రతిభ, సృజనాత్మకతను వెలికితీసి వారిని అన్ని రంగాల్లో ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారిస్తోందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తెలిపారు. యువత దేశానికి మార్గదర్శకులని, 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం, ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో యువత క్రియాశీలకంగా భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. అశోకా ఇంజనీరింగ్ కళాశాలలో జిల్లా యువజన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యువత ప్రతిభా పోటీల కార్యక్రమంలో భాగంగా జానపద నృత్యాలు, చిత్రలేఖనం, కవితా రచన తదితర విభాగాల్లో నిర్వహిస్తున్న పోటీలు విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొనడమే ముఖ్యమని, విజయం సాధించలేకపోయినా నిరుత్సాహపడకుండా తదుపరి అవకాశాన్ని విజయానికి పునాదిగా తీసుకుని ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు. యువతకు నైపుణ్యాభివృద్ధి అత్యంత కీలకమని ఎమ్మెల్యే తెలిపారు. జిల్లాలో పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు పెరుగుతున్న నేపథ్యంలో యువత పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. నైపుణ్యాల కొరత కారణంగా స్థానిక యువతకు లభించాల్సిన ఉద్యోగ అవకాశాలు ఇతర ప్రాంతాల అభ్యర్థులకు వెళ్లకుండా విద్యార్థులు సాంకేతిక, వృత్తి నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ద్వారా నియామక ప్రక్రియను ముందుకు తీసుకెళ్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇప్పటికే 16, వేల పైన పోస్టులకు నియామక ప్రక్రియ చేపట్టినట్లు, మరో 3,000 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ వెలువడనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా విద్యార్థినులు ఆత్మవిశ్వాసం, పట్టుదలతో తమకు నచ్చిన రంగాన్ని ఎంచుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. మహిళల్లో సహనం, ఓర్పు, పట్టుదల వంటి లక్షణాలు ఉన్నాయని, లక్ష్యాన్ని నిర్దేశించుకుని కృషి చేస్తే ఏ రంగంలోనైనా రాణించవచ్చని తెలిపారు. జిల్లా స్థాయిలో ప్రతిభను చాటిన విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో కూడా పాల్గొని తమ ప్రతిభను నిరూపించుకోవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. యువతకు ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని విద్య, నైపుణ్యం, ఉపాధి, సృజనాత్మక రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదగాలని ఎమ్మెల్యే సూచించారు.
అనంతరం సాంస్కృతిక నాట్యం చేసిన విద్యార్థులకు మొమెంటో తో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఎస్.టి. కమిషన్ సభ్యులు వెంకటప్ప,కురువ కార్పొరేషన్ డైరెక్టర్ రామకృష్ణ, సెట్కూర్ సీఈవో వేణుగోపాల్, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి దీప్తి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కిషోర్ రెడ్డి, డీఎస్పీ మహబూబ్ బాషా, కెవి సుబ్బారెడ్డి విద్యాసంస్థల యాజమాన్యం కెవి సుబ్బారెడ్డి, అశోకా మహిళ ఇంజనీరింగ్ కళాశాల సీఈవో హరికృష్ణ, కళాశాల ప్రిన్సిపల్ నవీన్, టిడిపి రాష్ట్ర మహిళా కార్యదర్శి పద్మలత తదితరులు పాల్గొన్నారు.