విద్యార్థుల మానసిక ఆరోగ్యం, పై శాస్త్రీయ సర్వే.జిల్లా కలెక్టర్ మహేష్ కుమర్
కిమ్స్ సైకియాట్రిస్ట్ల సూచనలతో డేటా సేకరణ, విశ్లేషణ...
.అమలాపురం మేజర్ న్యూస్ విద్యార్థుల మానసిక ఆరోగ్యం, మానసిక క్షేమం, విద్యాభ్యాసంపై వారి పరిస్థితులను సమగ్రంగా అంచనా వేసేందుకు చేపట్టనున్న సర్వేను శాస్త్రీయంగా, పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ నందు వైద్యా ఆరోగ్య శాఖ, విపాసన మిత్ర కోఆర్డినేటర్లు కిమ్స్ సైకియాట్రిస్ట్ అధికారులతో పాఠశాలలు, వసతి గృహాల్లోని విద్యార్థుల మానసిక స్థితిగతులు, అధ్యయన పరిస్థితులపై నిర్వహించనున్న సర్వేకు సంబంధించిన కార్యాచరణపై సంబంధిత అధికారులతో ఆయన సమగ్రంగా సమీక్షించారు.
విద్యార్థుల మానసిక క్షేమం వారి చదువు, ప్రవర్తన, వ్యక్తిత్వ వికాసం, భవిష్యత్ అభివృద్ధికి ఎంతో కీలకమని కలెక్టర్ పేర్కొన్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న మానసిక, విద్యాపరమైన అంశాలను ముందుగానే గుర్తించి అవసరమైన సహాయం, మార్గదర్శకత్వం అందించేందుకు ఈ అధ్యయనం ఉపయోగపడేలా చూడాలని సూచించారు ప్రస్తుతం సిద్ధం చేసిన ప్రశ్నావళినళమైన తెలుగులోకి అనువదించేందుకు డీఈఓ ఆధ్వర్యంలో ఒక తెలుగు పండితుడిని నియమించాలని సూచించారు.
అనువాదంలో పదాల అర్థం మారకుండా, విద్యార్థులకు సహజంగా అర్థమయ్యే పదాలను మాత్రమే ఉపయోగించాలని తెలిపారు. ఎంపిక చేసిన ఆరు సంస్థలు/పాఠశాలల నుంచి ఇద్దరు లేదా ముగ్గురు చొప్పున ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు.ప్రశ్నావళిలోని ప్రతి అంశాన్ని ఉపాధ్యాయులు పూర్తిగా అర్థం చేసుకోవాలని, విద్యార్థులకు ప్రశ్నలను ఎలా వివరించాలి, సమాధానాలను ఏ విధంగా నమోదు చేయాలి, విద్యార్థులపై ఎటువంటి ప్రభావం చూపకుండా సమాచారాన్ని ఎలా సేకరించాలి అనే అంశాలపై శిక్షణ ఇవ్వాలని సూచించారు.
సర్వే సమయంలో విద్యార్థులు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే వాతావరణాన్ని కల్పించాలని, వారి సమాధానాలను ప్రభావితం చేసే విధంగా ఉపాధ్యాయులు వ్యవహరించకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు.కిమ్స్ నిపుణులతో సమన్వయం విద్యార్థుల మానసిక ఆరోగ్యానికి సంబంధించిన అధ్యయనం కావడంతో మానసిక వైద్య నిపుణుల భాగస్వామ్యం అవసరమని కలెక్టర్ తెలిపారు. కిమ్స్ ఆసుపత్రికి చెందిన సైకియాట్రిస్ట్ నిపుణులతో సమన్వయం చేసుకుంటూ ప్రశ్నావళి నిర్వహణ, డేటా సేకరణ, డేటా విశ్లేషణ తదితర ప్రక్రియలను శాస్త్రీయంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
సర్వే ద్వారా సేకరించిన సమాచారాన్ని నిపుణుల సూచనల మేరకు విశ్లేషించాలని, విద్యార్థుల మానసిక క్షేమానికి సంబంధించిన సమస్యలు లేదా అవసరాలను గుర్తించే విధంగా అధ్యయన ఫలితాలను రూపొందించాలని సూచించారు. అవసరమైన సందర్భాల్లో విద్యార్థులకు కౌన్సెలింగ్, మార్గదర్శకత్వం వంటి సహాయక చర్యలు అందించే విధంగా తదుపరి కార్యాచరణ రూపొందించేందుకు ఈ అధ్యయనం ఉపయోగపడాలని పేర్కొన్నారు.
డేటా సేకరణ, విశ్లేషణ పకడ్బందీగా సర్వేలో సేకరించే ప్రతి సమాచారం ఖచ్చితంగా నమోదు కావాలని కలెక్టర్ సూచించారు. డేటా సేకరణలో పొరపాట్లు, పునరావృతాలు లేకుండా ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. సేకరించిన సమాచారాన్ని గణాంకపరంగా విశ్లేషించేందుకు స్టాటిస్టీషియన్ సహకారం తీసుకోవాలని తెలిపారు.
విద్యార్థుల నుంచి సేకరించే వ్యక్తిగత, సున్నితమైన సమాచార గోప్యతను తప్పనిసరిగా కాపాడాలని కలెక్టర్ స్పష్టం చేశారు. విద్యార్థుల వివరాలను అనవసరంగా బహిర్గతం చేయకూడదని, అధ్యయనం ఉద్దేశాలకు అనుగుణంగానే సమాచారాన్ని వినియోగించాలని సూచించారు.
శుక్రవారం నాటికి ప్రాథమిక ప్రక్రియ పూర్తి ప్రశ్నావళి తెలుగు అనువాదం, అనువాద పరిశీలన, ఉపాధ్యాయుల ఎంపిక, శిక్షణ తదితర ప్రాథమిక ప్రక్రియలను శుక్రవారం నాటికి కలెక్టరేట్ వేదికగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అనంతరం సర్వే నిర్వహణకు సంబంధించిన తదుపరి కార్యాచరణను వెంటనే ప్రారంభించాలని సూచించారు.
అధ్యయన ప్రక్రియలో వైద్య నిపుణులు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, గణాంక నిపుణులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ తెలిపారు. ప్రతి విద్యార్థుల సమస్యలను సకాలంలో గుర్తించి, వారికి అవసరమైన మార్గదర్శకత్వం అందించేలా పాఠశాలలు, వసతి గృహాల్లో అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాలని సూచించారు. అధ్యయనం పూర్తయిన అనంతరం నిపుణుల విశ్లేషణతో సమగ్ర నివేదిక రూపొందించి, దాని ఆధారంగా అవసరమైన తదుపరి చర్యలను చేపట్టాలని అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో డి.సి.హెచ్.ఎస్ కె. కార్తీక్, మిత్ర కోఆర్డినేటర్ టి. ప్రహ్లాద్, మిత్ర కోఆర్డినేటర్లు అమర్, సాయినాథ్, ఏ.పి.ఒ ఎం.ఎ.ఆర్. భీమారావు, డి.ఐ.పి.ఆర్.ఒ సిహెచ్. శ్రీనివాసు, స్టాటిస్టీషియన్ పి. సీతారామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.