తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాల పరిశీలన -- నష్టాల్ని పరిశీలించిన జిల్లా ఇన్‌చార్జి మంత్రి గొట్టిపాటి,జిల్లా కలెక్టర్ నాగరాణి
పాలకొల్లు, మేజర్ న్యూస్ : అర్నబ్ తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు నీట మునిగి దెబ్బతిన్న పంట పొలాలను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు.పాలకొల్లు మండలం శివదేవుని చిక్కాల గ్రామం రహదారి వెంట ఉన్న వ్యవసాయ భూముల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో నీట మునిగిన వరి పంటను మంత్రి, జిల్లా కలెక్టర్ పరిశీలించారు. భారీ వర్షాల కారణంగా వరి పంటకు జరిగిన నష్టాన్ని వారు ప్రత్యక్షంగా పరిశీలించి, పంట పరిస్థితిని రైతుల నుంచి తెలుసుకున్నారు. నీటిలో మునిగి దెబ్బతిన్న వరి కంకులను మంత్రి స్వయంగా చేతిలోకి తీసుకుని పరిశీలించారు. పంటలు దెబ్బతినడంతో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.తుఫాను ప్రభావంతో వ్యవసాయ రంగానికి కలిగిన నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించడం ద్వారా పంటల ప్రస్తుత పరిస్థితిని అంచనా వేసేందుకు అధికారులు చర్యలు చేపట్టలని తెలిపారు. పంట నష్టానికి సంబంధించిన వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా నివేదికలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు తెలిపారు.రహదారులపై విరిగిపడిన చెట్ల తొలగింపును పరిశీలించిన మంత్రి, కలెక్టర్అనంతరం దిగమర్రు గ్రామం వద్ద రహదారిపై విరిగిపడిన చెట్లను మంత్రి గొట్టిపాటి రవికుమార్, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పరిశీలించారు. రహదారిపై పడిన చెట్లను తొలగించి రాకపోకలకు అంతరాయం లేకుండా చేపడుతున్న చర్యలను స్వయంగా సమీక్షించారు. ప్రజలకు రవాణా పరంగా ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు సూచనలు జారీ చేశారు.తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పంట నష్టం, రహదారుల పరిస్థితి, ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులపై అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, ప్రజలకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.ఈ పర్యటనలో నరసాపురం ఆర్డీఓ కె. దాసిరాజు, పాలకొల్లు తహసీల్దార్ దుర్గా కిషోర్, ఇతర సంబంధిత అధికారులు వెంట వున్నారు.