డిజిటల్ వరల్డ్‌లోకి మెగాస్టార్ ఎంట్రీ: నెట్‌ఫ్లిక్స్ కోసం చిరంజీవి ‘మెగావర్స్’ టాక్ షో షురూ
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: టాలీవుడ్ లెజెండరీ హీరో, మెగాస్టార్ చిరంజీవి దశాబ్దాలుగా తన అద్భుతమైన నటనతో వెండితెరపై కోట్లాది మంది ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ఆయన మొదటిసారిగా డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రపంచంలోకి అడుగుపెడుతూ సరికొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. ప్రముఖ గ్లోబల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా ‘మెగావర్స్’ పేరుతో ప్రతిష్టాత్మకమైన టాక్ షోను ఆయన ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడినప్పటి నుంచే సినీ వర్గాలతో పాటు అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.
భారతీయ సినిమా గొప్ప లెగసీని సెలబ్రేట్ చేసేలా రూపొందుతున్న ఈ ప్రత్యేకమైన టాక్ షోలో చిరంజీవి తనదైన శైలిలో హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. వివిధ తరాలకు చెందిన ప్రముఖ నటులు, సినీ దిగ్గజాలతో ఆయన ఈ వేదికపై ముచ్చటించనున్నారు. సినిమా పరిశ్రమకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు, తెరవెనుక విశేషాలు, నటీనటుల వ్యక్తిగత ప్రయాణంలోని మరువలేని జ్ఞాపకాలను ఈ షో మరింత సన్నిహితంగా ప్రేక్షకులకు పరిచయం చేయనుంది. మెగాస్టార్ సహజమైన ఆత్మీయత, కామెడీ టైమింగ్, ఆలోచనా విధానం ఈ కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సుందరమైన సెట్‌లో ఈ షోకి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ క్రేజీ టాక్ షో మొదటి ఎపిసోడ్‌కు సంబంధించి టాలీవుడ్ ప్రముఖ హాస్యనటులు బ్రహ్మానందం, సునీల్, సత్య సందడి చేసినట్లు సమాచారం. చిరంజీవి చమత్కారానికి ఈ కామెడీ స్టార్స్ నవ్వులు తోడవడంతో మొదటి షెడ్యూల్ చాలా సరదాగా సాగినట్లు తెలుస్తోంది. ఈ షోలో మరికొందరు యూనివర్సల్ స్టార్స్ మరియు ప్రముఖ సెలబ్రిటీలు కూడా అతిథులుగా పాల్గొననున్నట్లు తెలుస్తోంది.
మాస్‌కి గ్రామర్, స్టైల్‌కి డెఫినిషన్ అంటూ నెట్‌ఫ్లిక్స్ సంస్థ విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గతంలో బుల్లితెరపై కొన్ని కార్యక్రమాలకు అలరించిన చిరంజీవి, ఇప్పుడు ఓటీటీ వేదికపై పూర్తి స్థాయి సెలబ్రిటీ టాక్ షో చేస్తుండటం ఇదే మొదటిసారి. త్వరలోనే ఈ షోకి సంబంధించిన స్ట్రీమింగ్ తేదీతో పాటు పూర్తి అతిథుల జాబితాను అధికారికంగా వెల్లడించనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ వర్గాలు వెల్లడించాయి. వెండితెరపై తన మార్క్ చూపించిన మెగాస్టార్, డిజిటల్ స్క్రీన్‌పై ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
Also Read: 'కాళాంకి భైరవుడు' నుంచి థర్డ్ సింగిల్ రిలీజ్.. ఆవిష్కరించిన రాకింగ్ స్టార్ మంచు మనోజ్!