పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకోండి
జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్
చిత్తూరు ప్రతినిధి మేజర్ న్యూస్: చిత్తూరు జిల్లాలో ఓటరుగా ఉండి ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ఉద్యోగులు, సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో వివిధ మండల ప్రజా పరిషత్ పరిధిలో మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు ఎం.పీ.టి.సి., జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుల ఎన్నికలకు సంబంధించి ఈనెల 5వ తేదీ జరగనున్న రెండవ సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయా మండలాల రిటర్నింగ్ అధికారులకు జిల్లా కలెక్టర్ ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు.ఆయా మండల ప్రజా పరిషత్ పరిధిలో ఓటు హక్కు కలిగి ఉండి, ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయడానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు నవంబర్ 1 నుండి 2 వ తేదీ ఉదయం 10.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల లోపు ఆయా మండలాల ప్రజా పరిషత్ కార్యాలయం లోని రిటర్నింగ్ అధికారికి తమ దరఖాస్తులను సమర్పించాలి. దరఖాస్తుతో పాటు ఎన్నికల విధుల ఉత్తర్వుల ప్రతిని, ఓటరు గుర్తింపు కార్డు జిరాక్స్ ప్రతిని జతపరచి సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.