తుపాకీ వీడి.. జనజీవన స్రవంతిలోకి..
(మావోయిస్టుల కొత్త జీవితానికి ఏపీ పోలీసుల భరోసా)
ఏపీ స్టేట్ బ్యూరో, సూర్య ప్రధాన ప్రతినిధి:అడవి బాట వీడి, ఆయుధాలను వదిలి సమాజంలో గౌరవప్రదంగా బతకాలని నిర్ణయించుకున్న 18 మంది మాజీ మావోయిస్టుల కళ్లలో కొత్త ఆశలు చిగురించాయి. తప్పుదారి పట్టిన యువతను తిరిగి జనజీవన స్రవంతిలోకి తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు ప్రధాన అధికారి (డీజీపీ) శ్రీ హరీష్ కుమార్ గుప్తా విజయవాడలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో వారికి రూ. 75 లక్షల విలువైన పునరావాస చెక్కులను (డిమాండ్ డ్రాఫ్ట్‌లు) అందజేశారు.
లొంగిపోయిన వారిలో రాష్ట్ర కమిటీ సభ్యుడు జోరిగ నాగరాజు అలియాస్ కమలేష్‌తో పాటు ఇద్దరు డివిజనల్ కమిటీ సభ్యులు, 10 మంది ఏరియా కమిటీ సభ్యులు, ఐదుగురు దళ సభ్యులు ఉన్నారు. తమకు అండగా నిలుస్తున్న ప్రభుత్వానికి, పోలీసు శాఖకు జోరిగ నాగరాజు మరియు ఇతర మాజీ మావోయిస్టులు కృతజ్ఞతలు తెలుపుతూ, మిగిలిన వారు కూడా హింసను వీడి బయటకు రావాలని పిలుపునిచ్చారు.
రెండున్నరేళ్లలో మారిన ముఖచిత్రం
ఈ సందర్భంగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ, గత రెండున్నర ఏళ్లుగా వామపక్ష తీవ్రవాద నియంత్రణలో ఏపీ పోలీసు శాఖ సాధించిన ప్రగతిని వివరించారు. ప్రభుత్వ మానవీయ పునరావాస విధానాలపై నమ్మకంతో గత రెండున్నరేళ్లలో ఒక కేంద్ర కమిటీ సభ్యుడు, ఇద్దరు ప్రత్యేక మండల కమిటీ సభ్యులు సహా మొత్తం 134 మంది మావోయిస్టులు ఆయుధాలు వీడి లొంగిపోయారని తెలిపారు. వీరిపై రూ. 2.87 కోట్ల బహుమతి ఉండగా, గతంలో రూ. 91 లక్షలు, ఇప్పుడు రూ. 75 లక్షలు అందజేశారు. మిగిలిన 32 మందికి త్వరలోనే రూ. 1.21 కోట్లు పంపిణీ చేయనున్నారు. మరోవైపు, ఎదురుకాల్పుల్లో 18 మంది మావోయిస్టులను మట్టుబెట్టగా, 73 మందిని అరెస్టు చేశామని, ఛత్తీస్‌గఢ్, ఒడిశా పోలీసులతో కలిసి నిర్వహించిన ఉమ్మడి దాడుల్లో 74 మంది మావోయిస్టుల ఏరివేతలో ఏపీ పోలీసులు కీలక పాత్ర పోషించారని వెల్లడించారు.
అభివృద్ధి, ఉపాధితో మారుతున్న మన్యం
కేవలం ఆపరేషన్లకే పరిమితం కాకుండా, ముఖ్యమంత్రి దార్శనిక నాయకత్వంలో మారుమూల గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది:
యువతకు ఉపాధి: పోలీసు శాఖ ఆధ్వర్యంలో 'సరళ్' ద్వారా 2,000 మందికి పైగా స్వయం ఉపాధి పొందగా, 'ప్రేరణ' కింద టాటా ఎలక్ట్రానిక్స్, వెదురు హస్తకళలు, గృహ వైద్య సేవలు వంటి రంగాల్లో 1,200 మంది యువతకు ఉద్యోగాలు లభించాయి. 'స్ఫూర్తి' శిక్షణ ద్వారా 175 మంది పోలీసు, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు.
రహదారులు, సమాచార వ్యవస్థ: 'అడవి తల్లి బాట' మరియు ఇతర రహదారి పథకాల ద్వారా అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో వందలాది కిలోమీటర్ల మేర రోడ్లు, 39 వంతెనలు నిర్మించారు. అలాగే, 2,090 సెల్ టవర్ల ఏర్పాటుతో 96 శాతం మారుమూల గ్రామాలకు సమాచార అనుసంధానం అందుబాటులోకి వచ్చింది.
లొంగిపోయిన మావోయిస్టులతో నిరంతరం సంప్రదిస్తూ, వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని జిల్లా యంత్రాంగానికి, పోలీసు అధికారులకు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు డీజీపీలు ఎన్. మధుసూదన రెడ్డి (శాంతిభద్రతలు), మహేష్ చంద్ర లడ్డా (నిఘా విభాగం), ఐజీపీ పి.హెచ్.డి. రామకృష్ణ, డీఐజీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి, ఎస్పీలు వి. గీతా దేవి, కె. ఆరిఫ్ హఫీజ్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.