చిత్తూరులో రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు సర్వం సిద్ధం! డిసెంబర్ 12, 13, 14 తేదీల్లో పీవీకేఎన్ కళాశాల మైదానంలో సీనియర్ సాఫ్ట్‌బాల్ టోర్నమెంట్ పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్.. రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి మంది క్రీడాకారుల రాక
చిత్తూర్ అర్బన్ మేజర్ న్యూస్:చిత్తూరు నగరంలో రాష్ట్రస్థాయి సీనియర్ సాఫ్ట్‌బాల్ పోటీల నిర్వహణకు సన్నాహాలు ముమ్మరమయ్యాయి. డిసెంబర్ 12, 13, 14 తేదీల్లో స్థానిక పీవీకేఎన్ కళాశాల క్రీడామైదానంలో మూడు రోజులపాటు జరగనున్న ఈ టోర్నమెంట్ పోస్టర్‌ను చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తన నివాసంలో ఆవిష్కరించారు. జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు, కార్పొరేటర్ పి.ఎస్. చందు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా క్రీడాకారులు పాల్గొనే ఈ పోటీలను విజయవంతం చేసేందుకు తనవంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్‌తో కూడా మాట్లాడినట్లు వెల్లడించారు. చిత్తూరు జిల్లా కేంద్రానికి వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే క్రీడాకారులు, కోచ్‌లు, సిబ్బంది, అధికారులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేలా జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్‌కు అండగా ఉంటానని స్పష్టం చేశారు. పోటీల నిర్వహణలో ఎప్పటికప్పుడు అవసరమైన సహకారం అందించేందుకు ఎమ్మెల్యేగా తాను ముందుంటానని భరోసా ఇచ్చారు.రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి మంది క్రీడాకారులు
జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ చైర్మన్ పి. షణ్ముగం మాట్లాడుతూ ఈ రాష్ట్రస్థాయి సీనియర్ టోర్నమెంట్‌లో వివిధ జిల్లాల నుంచి సుమారు వెయ్యి మంది క్రీడాకారులు పాల్గొననున్నట్లు తెలిపారు. పోటీలకు అవసరమైన క్రీడామైదానం, భోజన వసతి, ఇతర మౌలిక సదుపాయాలను జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే సహకారంతో సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. చిత్తూరు జిల్లాలో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించడం గర్వకారణమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ చైర్మన్ పి. షణ్ముగంతో పాటు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ రాష్ట్ర కార్యదర్శి వి. సురేంద్ర కుమార్, పార్టీ నాయకులు కిషోర్, ద్వారకనాథ్, సీనియర్ వ్యాయామ విద్యా సంచాలకులు కృష్ణ, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
చిత్తూరు అర్బన్ రిపోర్టర్, లవకుమార్