చదువుతో పాటు మంచి వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవాలిః గవర్నర్ శివప్రతాప్ శుక్లా
సూర్య, తెలంగాణ, బ్యూరో ప్రతినిధి: విద్యార్థులు డిగ్రీతో పాటు మంచి వ్యక్తిత్వాన్ని కూడా నిర్మించుకోవాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. కేయూ 24వ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గవర్నర్.. పట్టభద్రులతో ప్రమాణం చేయించారు. అనంతరం మాట్లాడుతూ.. జ్ఞానం, క్రమశిక్షణ, నిజాయితీ, విలువలే విజయానికి పునాది అని చెప్పుకొచ్చారు. ‘సమాజం, దేశం మనకు ఏమిచ్చాయో కాకుండా మనం దేశానికి ఏమి ఇస్తామో ఆలోచించాలి’ అని సూచించారు. దేశ ప్రయోజనాలే వ్యక్తిగత ప్రయోజనాల కంటే గొప్పవన్నారు. భారత్ ఉంటేనే మనం ఉంటాం అనే భావనతో ముందుకు సాగాలని గవర్నర్ తెలిపారు. వికసిత్ భారత్–2047 లక్ష్య సాధనలో యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. విద్య, ఆరోగ్యం, సాంకేతికత రంగాల్లో యువత సేవాభావంతో పనిచేయాలన్నారు. శాస్త్రీయ దృక్పథం, సత్యాలు, ఆధారాలను గౌరవించే సంస్కారం పెంపొందించుకోవాలని తెలిపారు. ఇతరుల అభిప్రాయాలను గౌరవించి, ఓపెన్ మైండ్‌తో ఆలోచించాలని.. అకాడెమిక్ ఇంటిగ్రిటీ ని జీవితాంతం పాటించాలని సూచించారు.
గోల్డ్ మెడలిస్టులు సమాజానికి ఆదర్శంగా నిలవాలని శివప్రతాప్ శుక్లా తెలిపారు. విజయాన్ని వ్యక్తిగత గౌరవంగా కాకుండా సమాజానికి సేవ చేసే అవకాశంగా చూడాలన్నారు. దేశాన్ని మాదకద్రవ్యాల రహిత భారత్‌గా తీర్చిదిద్దేందుకు యువత ముందుండాలని వెల్లడించారు. మాదకద్రవ్యాలకు బానిసైన వారిని ద్వేషించకుండా వారిని మార్పు దిశగా నడిపించాలని సూచించారు. ప్రతి విద్యార్థి కనీసం ఒక సామాజిక సమస్య పరిష్కారానికి కృషి చేయాలన్నారు. టెక్నాలజీని సమాజ హితం కోసం వినియోగించాలని తెలిపారు. విద్యార్థి జీవితం భవిష్యత్తు దిశను నిర్ణయించే అత్యంత కీలక దశగా చెప్పుకొచ్చారు. దేశాభివృద్ధికి సేవాభావం, కృషి, బాధ్యతాయుతమైన పౌరసత్వం అవసరమన్నారు. ‘సిటిజన్ ఫస్ట్’ అనే భావనతో ప్రతి పని చేయాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పేర్కొన్నారు
ఎ.రవీందర్, హైదరాబాద్.