నియోజకవర్గాల పునర్విభజన దక్షిణ భారతదేశానికి గొడ్డలి పెట్టు
హనుమకొండ, మేజర్ న్యూస్, కేంద్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలు దక్షిణ భారతదేశ రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యాన్ని దెబ్బతీసే కుట్రలో భాగమని భారత కమ్యూనిస్ట్ పార్టీ (సిపిఐ) రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు తీవ్రంగా విమర్శించారు.శనివారం హనుమకొండ బాల సముద్రంలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో జిల్లా స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. పార్టీ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ పిలుపు మేరకు కుటుంబ నియంత్రణ పథకాలను దక్షిణాది రాష్ట్రాలు అత్యంత సమర్థవంతంగా అమలు చేసి జనాభా నియంత్రణ సాధించాయని గుర్తు చేశారు. నేడు అదే జనాభా నియంత్రణను సాకుగా చూపి దక్షిణాది రాష్ట్రాల లోక్‌సభ స్థానాల నిష్పత్తిని తగ్గించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి, సమాఖ్య వ్యవస్థకు విరుద్ధమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జనాభా ప్రాతిపదికన లోక్‌సభ స్థానాలను పెంచితే ఉత్తరాది రాష్ట్రాలకు భారీగా సీట్లు పెరిగి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల వాటా గణనీయంగా పడిపోయే ప్రమాదం ఉందన్నారు. దేశ ఆర్థికాభివృద్ధికి, పన్నుల ఆదాయానికి అత్యధిక వాటా అందిస్తున్న దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంటులో గొంతు లేకుండా చేసే ప్రయత్నం సరికాదని అన్నారు. ఉత్తర, దక్షిణ రాష్ట్రాల మధ్య రాజకీయ సమతుల్యత దెబ్బతింటే దేశ సమగ్రతకే ప్రమాదం ఏర్పడుతుందని, అభివృద్ధి సాధించిన రాష్ట్రాలను శిక్షించడం ఏ విధంగానూ సమంజసం కాదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలను తక్షణమే విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీసుకువస్తున్న పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బహిరంగంగా మద్దతు తెలపడం దక్షిణ భారతదేశ ప్రజలకు చేసిన చారిత్రక ద్రోహమని తక్కళ్లపల్లి శ్రీనివాసరావు తీవ్రంగా ధ్వజమెత్తారు.కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ, తన రాజకీయ స్వార్థం కోసం దక్షిణాది రాష్ట్రాల హక్కులను, ఆత్మగౌరవాన్ని చంద్రబాబు కేంద్రం వద్ద తాకట్టు పెట్టారని ఆయన విమర్శించారు. నియోజకవర్గాల పునర్విభజన అంశంపై దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి, ప్రస్తుత సీట్ల నిష్పత్తికి ఎలాంటి నష్టం కలగకుండా రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం తన వైఖరి మార్చుకోకపోతే దక్షిణాది ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని తక్కళ్లపల్లి శ్రీనివాసరావు హెచ్చరించారు. సమావేశంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సిరబోయిన కరుణాకర్, ఆదరి శ్రీనివాస్,జిల్లా సహాయ కార్యదర్శులు తోట బిక్షపతి, మద్దెల ఎల్లేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు కర్రె లక్ష్మణ్, ఏదునూరి వెంకట్రాజం, ఎన్ఏ స్టాలిన్, మునిగాల బిక్షపతి,మాలోతు శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ ;రమేష్ ,హనుమకొండ , హనుమకొండ జిల్లా