జీ5లోకి సైకలాజికల్ థ్రిల్లర్ దాలింబ్.. జితేంద్ర కుమార్ కొత్త సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: ప్రముఖ నటుడు జితేంద్ర కుమార్ ప్రధాన పాత్రలో నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం దాలింబ్ నేరుగా ఓటీటీ వేదికపై ప్రేక్షకుల ముందుకు రానుంది. డిసెంబర్ 4 నుంచి జీ5 వేదికగా ఈ చిత్రం స్ట్రీమింగ్ ప్రారంభం కానున్నట్లు నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సస్పెన్స్, భావోద్వేగాల కలయికతో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది.
ముంబైలోని మధ్యతరగతి శివారు ప్రాంతాల నేపథ్యంలో సాగే ఈ కథలో రెండు కీలక మిస్టరీల చుట్టూ విచారణ కొనసాగుతుంది. ఒక చిన్నారి అదృశ్యం, మానసిక ఆరోగ్య కేంద్రం నుంచి తప్పించుకున్న వ్యక్తి ఉదంతాలు కథా గమనాన్ని మలుపుతిప్పుతూ ఉత్కంఠను పంచుతాయి. సాధారణ పరిసరాల వెనుక దాగి ఉన్న రహస్యాలు, సంబంధాలలోని చిక్కులను ఆసక్తికరంగా ఆవిష్కరించనున్నారు.
ఈ చిత్రంలో జితేంద్ర కుమార్ ఇప్పటివరకు కనిపించని విభిన్నమైన, లోతైన పాత్రలో అలరించనుండగా, పోలీసు అధికారి పాత్రలో ప్రియా బాపట్ కీలక పాత్ర పోషించారు. ప్రియా అవెన్ రచన, దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎలిప్సిస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై తనుజ్ గార్గ్, అతుల్ కస్బేకర్ నిర్మించారు.
క్షీతిశ్ దాతే, కవిన్ డేవ్, సాయి ప్రసాద్, హరీశ్ కులకర్ణి, సాగర్ యాదవ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. మిస్టరీ, భయం, మానవీయ భావోద్వేగాల మేళవింపుతో రూపొందిన దాలింబ్ డిసెంబర్ 4న ఓటీటీ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.