మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అణగారిన వర్గాల అభ్యున్నతి, మహిళా సాధికారతకు పూలే చేసిన సేవలు చిరస్మరణీయం.
చిత్తూరు అర్బన్, మేజర్ న్యూస్: అణగారిన వర్గాల విద్యాభివృద్ధికి, మహిళా సాధికారతకు, సామాజిక సమానత్వ సాధనకు జీవితాంతం కృషి చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని 35వ డివిజన్ ఇన్ఛార్జి, బీజేపీ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర బీసీ నాయకుడు అట్లూరి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.
మహాత్మా జ్యోతిరావు పూలే 136వ వర్ధంతి సందర్భంగా శనివారం చిత్తూరు నగరంలోని వినాయకపురం 35వ డివిజన్లో కూటమి బీసీ నాయకులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అట్లూరి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. సమాజంలో నెలకొన్న కుల వివక్ష, అసమానతలను రూపుమాపేందుకు జ్యోతిరావు పూలే చేసిన కృషి చిరస్మరణీయమన్నారు.
మహిళలకు విద్య అందించడమే లక్ష్యంగా బాలికల కోసం ప్రత్యేక పాఠశాలను ప్రారంభించి, విద్య ద్వారానే సమాజంలో నిజమైన మార్పు సాధ్యమని నిరూపించారని తెలిపారు. అణగారిన వర్గాలకు విద్యావకాశాలు కల్పించడంతో పాటు మహిళలకు సమాన హక్కులు, గౌరవం కల్పించేందుకు ఆయన చేసిన పోరాటం నేటి తరానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. సమానత్వం, సామాజిక న్యాయం, విద్యాభివృద్ధి కోసం పూలే చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కూటమి బీసీ నాయకులు కె. శ్రీనివాసులు, ఎ. శ్రీనివాస్ మొదలియార్, హరి, తరుణ్, పుణీత్ తదితరులు పాల్గొన్నారు.
చిత్తూరు అర్బన్ రిపోర్టర్, లవకుమార్