కట్టుదిట్టమైన భద్రతలోనూ చిన్నారి అభిమానిని ఆప్యాయంగా పలకరించిన సల్మాన్ ఖాన్.. వీడియో వైరల్
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ చిన్నారులపై చూపే ఆప్యాయతకు సంబంధించిన మరో హృద్యమైన దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. కట్టుదిట్టమైన భద్రత నడుమ విమానాశ్రయం వద్ద కనిపించిన సల్మాన్, తనను కలిసేందుకు వచ్చిన చిన్నారి అభిమానిని ఆప్యాయంగా దగ్గరకు పిలిచి నుదుటిపై ముద్దు పెట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
మాతృభూమి చిత్ర ప్రచార కార్యక్రమాల అనంతరం సహనటి చిత్రాంగద సింగ్‌తో కలిసి సల్మాన్ ఖాన్ విమానాశ్రయానికి చేరుకున్నారు. భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య ఫొటోగ్రాఫర్లు కొంత దూరం నుంచి ఫొటోలు తీస్తుండగా, ఓ చిన్నారి తనను కలవాలని కోరడంతో సల్మాన్ ఆప్యాయంగా పిలిచారు. పరుగెత్తుకుంటూ వచ్చిన ఆ బాలుడిని చూసి చిరునవ్వు చిందించిన సల్మాన్, వంగి నుదుటిపై ముద్దు పెట్టి ఆనందపరిచారు. అనంతరం తన కారు వైపు వెళ్లిపోయారు.
ఈ దృశ్యాలపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పిల్లలతో సల్మాన్ మెలిగే తీరు ఎంతో సహజంగా, ఆప్యాయంగా ఉంటుందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల ఒక టాక్ షోలోనూ తనకు పిల్లలంటే ఎంతో ఇష్టమని, భవిష్యత్తులో తండ్రి కావాలనే కోరిక ఉందని సల్మాన్ మనసులోని మాటను పంచుకున్నారు.
ఇక సినిమాల విషయానికొస్తే, అపూర్వ లఖియా దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ నటించిన మాతృభూమి చిత్రం డిసెంబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది. గల్వాన్ లోయ ఘటన నేపథ్యంలో సైనికుడి పాత్రలో సల్మాన్ కనిపించనున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది.