సినీ సంగీతం సమాజానికి అద్దంలాంటిది.. సల్మాన్ ఖాన్ పాట విమర్శలపై జావేద్ అఖ్తర్ కీలక వ్యాఖ్యలు
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: బాలీవుడ్ ప్రముఖ గేయ రచయిత జావేద్ అఖ్తర్ ప్రస్తుత సినీ గీతాల సాహిత్య నాణ్యతపై వస్తున్న విమర్శలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సల్మాన్ ఖాన్ నటించిన మాతృభూమి చిత్రంలోని తేరీ సెక్సీ బ్యూటీ పాట సాహిత్యంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, ఆయన స్పందిస్తూ సినీ పరిశ్రమ, సంగీతం సమాజానికి అతీతంగా ఉండవని, అవి సమాజంలోని పరిస్థితులనే ప్రతిబింబిస్తాయని స్పష్టం చేశారు. నేటి తరంలో సాహిత్యం, కవిత్వం చదివే అలవాటు తగ్గడం వల్ల పదజాలం పరిమితమైందని, భాషను కేవలం భావప్రసార సాధనంగా మాత్రమే కాకుండా ఒక లలిత కళగా గుర్తించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
సమాజం లాభదాయక అంశాల వైపు మొగ్గు చూపడం వల్ల సంగీతం, కళలు, సాహిత్యంలోని లోతు తగ్గిపోతున్నదని జావేద్ అఖ్తర్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే యువతరం సొంతంగా సాహిత్యం, కళల విలువలను తెలుసుకునే ప్రయత్నం చేస్తుండటం ఆశాజనకమైన పరిణామమని, రాబోయే పది పదిహేనేళ్లలో సాహిత్య, సంగీత రంగాల్లో గొప్ప పునరుజ్జీవనం కనిపిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
మరోవైపు యుద్ధ నేపథ్యంలో సాగే మాతృభూమి సినిమాలో ఈ పాట ఎందుకు పెట్టారనే సందేహాలపై సల్మాన్ ఖాన్ ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. సైనికులు, అధికారులు తమ భార్యలను ప్రశంసించే సందర్భంలో ఈ గీతం వస్తుందని, సినిమా చూసినప్పుడు దాని ప్రాధాన్యత అందరికీ అర్థమవుతుందని వివరించారు. సాజిద్ ఖాన్ సంగీతం, సాహిత్యం అందించిన ఈ పాటను సల్మాన్ ఖాన్, ముస్కాన్ కలిసి ఆలపించారు. చిత్రాంగద సింగ్, ముఖేశ్ రిషి కీలక పాత్రల్లో నటించిన మాతృభూమి చిత్రం డిసెంబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది.
Also Read: రామాయణ పార్ట్ 1లో రావణుడిని కీర్తించలేదు.. యశ్ నటన వల్లే ఆదరణ దక్కిందన్న నమిత్ మల్హోత్రా