రాత్రికి రాత్రే ఆంధ్రకేసరి ప్రకాశం విగ్రహం తొలగించే ప్రయత్నం: అడ్డుకున్ విగ్రహ సాధన కమిటీ
గుంటూరు : తెల్లదొరల తుపాకి గుండుకు తన గుండెను ఎదురొడ్డిన ధీరుడు.. శాలువా నాకెందుకు అరటిపళ్ళు ఇస్తే ఒక పూట గడిచేదిగా అనే నిరాడంబరుడు.. సమరయోధుడిలా అటు దేశానికి, ముఖ్యమంత్రిగా ఇటు రాష్ట్రానికి సేవ చేసిన ఆంధ్ర రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులుకు గుంటూరులో ఘోర అవమానం జరిగింది. ఎక్కడైతే ఆయన 30వేల మంది స్వచ్ఛందకులతో సహాయ నిరాకరణ ఉద్యమం చేశారో.. అక్కడే ఆయన చరిత్రను చెరిపేసే ప్రయత్నం జరిగింది. రాత్రికి రాత్రే ప్రకాశం చౌక్‌పై పలుగులు దండెత్తాయి. విషయం తెలుసుకున్న ప్రకాశం పంతులు విగ్రహ సాధన కమిటీ ప్రతినిధులు, ఆంధ్ర కేసరి అభిమాన సంఘం నాయకులు అక్కడికి చేరుకోవడంతో ఆ కార్యక్రమానికి అడ్డుకట్ట పడింది.ప్రజోపయోగమైన ప్రగతి పనులు జరుగుతున్నప్పుడు దానికి అవరోధంగా ఉన్న వాటిని తొలగించడం సమంజసమే. దీన్ని ఎవరూ ఆక్షేపించరు. అయితే దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం వెళితే ఎవరూ అడ్డుకోరు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా అక్కడ ప్రకాశం పంతులు విగ్రహాన్ని ఏర్పాటు చేసినప్పుడు దానికొక కమిటీ కూడా ఏర్పడింది. నగరపాలక సంస్థ అధికారులు ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించాలని నిర్ణయించినప్పుడు ముందుగా ఆ విషయాన్ని కమిటీకి తెలియజే యాలి. తర్వాత అందరి సమిష్టి ఆమోదంతో గౌరవంగా దానిని తరలించాలి.అయితే అలాంటి వేమీ జరగకుండానే ఇక్కడ ప్రకాశం పంతులు విగ్రహాన్ని పడేయాలని చూశారు. దీంతో ఆగ్రహించి న ప్రకాశం పంతులు విగ్రహ సాధన కమిటీ ప్రతినిధులు, ఆంధ్ర కేసరి అభిమాన సంఘం నాయకులు విగ్రహం ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో అక్కడికి చేరుకున్న నగర ప్రణాళికా విభాగం అధికారి రాంబాబు వారితో మాట్లాడి అందరికీ ఆమోదకరమైన రీతిలోనే విగ్రహాన్ని తరలిస్తామని హామీ ఇచ్చిన మీదట వారు ఆందోళన విరమించారు.ఈ సందర్భంగా ఈచంపాటి వెంకటకృష్ణ (ఆచారి) మాట్లాడుతూ, ప్రకాశం చరిత్ర ఎవరో చెరిపేస్తే చెరిగిపోయేది కాదని స్పష్టం చేశారు. జరుగుతున్న అభివృద్ధికి ఆటంకం కలిగించాలన్నది తమ ఉద్దేశం కాదని.. అదే సమయంలో ప్రకాశం పంతులుకు అవమానం జరిగితే మాత్రం సహించేది లేదని ఆయన అన్నారు. బందా రవీంద్రనాథ్ మాట్లాడుతూ, ప్రకాశం పంతులు గుంటూరులో సహాయ నిరాకరణ ఉద్యమం చేపట్టిన స్థలంలో ఆయన విగ్రహం స్థాపించడం సముచితమన్న భావనతో అన్ని రాజకీయ పార్టీల ఏకాభిప్రాయంతో విగ్రహం ఏర్పాటు చేసి దానికి ప్రకాశం చౌక్‌గా నామకరణం చేసుకున్నట్లు వెల్లడించారు. ఇప్పుడు కూడా అదే విధంగా అందరి సమిష్టి నిర్ణయంతో ప్రకాశం పంతులు గౌరవానికి భంగం వాటిల్లకుండా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. ఆంధ్ర కేసరి అభిమాన సంఘం ప్రధాన కార్యదర్శి బందా శశి మాట్లాడుతూ, గుంటూరులో ఎవరి విగ్రహాన్నైనా ఇలా అవమానకర రీతిలో తొలగిస్తారా.. అని అధికారులను సూటిగా ప్రశ్నించారు. మరి ప్రకాశం పంతులు అంటే అంత చులకన భావం దేనికన్నారు. దీన్ని ఎంత మాత్రం సహించబోమని ఆయన హెచ్చరించారు.ఈ ఆందోళనలో బత్తుల దేవానంద్, రత్నప్రసాద్, భాగ్యారావు, రబ్బాని, విజయమ్మ, రవి, వెంకటరమణ, మాదాసు కిరణ్, దాసు, ప్రసన్న, సుబ్బరాజు, శంకర్, అంబేద్కర్, సాల్మన్, శ్రీనునాయక్, ఆటో శ్రీను తదితరులు పాల్గొన్నారు.
సూర్య నాయక్