జీవ రసాయన పద్ధతులతో చేసే వ్యవసాయం లాభసాటి
నగరం, మేజర్ న్యూస్:
పంట పొలాల్లో పురుగులను కేవలం మందులతోనే కాకుండా, సాంస్కృతిక, యాంత్రిక, జీవ, రసాయన పద్ధతులను సమన్వయం చేసుకుంటూ ఆర్థిక నష్ట స్థాయి అధిక మించేందుకు ఐ పి ఎం పద్ధతిలో మందులు వాడితే పురుగు మందుల ఖర్చు 40% వరకు తగ్గి, పర్యావరణం, నేల ఆరోగ్యం కాపాడుతుందని, విష అవశేషాలు లేని నాణ్యమైన పంట ఉత్పత్తి అవుతుందని బాపట్ల ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ కె. అచ్యుతరాజు అన్నారు. గురువారం మండల పరిధిలోని పెదమట్లపూడి రైతు సేవ కేంద్రంలో ఆత్మ వారి సౌజన్యంతో ఖేత్ బచావో అభియాన్ లో భాగంగా ఐ పి ఎం పై రైతు శిక్షణా కార్యక్రమాలు, క్షేత్ర ప్రదర్శనలు నిర్వహిస్తున్నందున రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇంచార్జీ రేపల్లె సహాయ వ్యవసాయ సంచాలకులు, మండల వ్యవసాయ అధికారి వేమూరి రమేష్ బాబు మాట్లాడుతూ పురుగు మందులకు బదులు సమగ్ర సస్యరక్షణ పాటించాలన్నారు.
మండలంలో వరి, మినుము, పెసర, వేరుశెనగ, మొక్కజొన్న పంటలలో పురుగులు, తెగుళ్ళ నివారణకు రైతులు విచ్చలవిడిగా రసాయన పురుగు మందులు వాడటం వలన పెట్టుబడి ఖర్చు పెరగడమే కాకుండా, పంటలకు, నేలకు, మానవ ఆరోగ్యానికి తీవ్ర నష్టం జరుగుతునందున రైతులు సమగ్ర సస్యరక్షణ పద్ధతులను పాటించాలని సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి కె. వంశీ కృష్ణ, గ్రామ వ్యవసాయ సహాయకులు జి. సాయిరామ కృష్ణ రెడ్డి, గ్రామ రైతులు పాల్గొన్నారు.