వెల్దుర్తి ఎంపీపీగా తోళ్ల మద్దిలేటి ప్రమాణం ఎంపీటీసీలతో ప్రమాణం చేయించిన ఆర్వో శ్రీదేవి ఘనంగా సన్మానించిన నేతలు.. అధికారుల అభినందనలు
వెల్దుర్తి, మేజర్ న్యూస్: వెల్దుర్తి మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా (ఎంపీపీ) తోళ్ల మద్దిలేటి గురువారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో రిటర్నింగ్ అధికారి (ఆర్వో) నాయకంటి శ్రీదేవి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మండలంలోని ఎంపీటీసీ సభ్యులతోనూ ఆర్వో ప్రమాణం చేయించడంతో నూతన పాలకవర్గం కొలువుదీరింది.
నేతలు, అధికారుల శుభాకాంక్షలు: నూతన ఎంపీపీగా బాధ్యతలు చేపట్టిన తోళ్ల మద్దిలేటిని జిల్లా సీనియర్ నాయకుడు బొమ్మిరెడ్డిపల్లె సుబ్బరాయుడు, మాజీ ఎంపీపీ ఎల్.ఈ. జ్ఞానేశ్వర్ గౌడ్, సింగిల్ విండో ఛైర్మన్ బొమ్మన రమాకాంత్ రెడ్డి, నాయకులు బోయినపల్లె కాంతారెడ్డి, పుల్లగుమ్మి అజయ్ రెడ్డి తదితరులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీడీవో చంద్రశేఖర్ రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ మునయ్య, డిప్యూటీ ఎంపీడీవో రవికిషోర్, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ బి.లత, పంచాయతీ కార్యదర్శులు, మండల పరిషత్ సిబ్బంది నూతన ఎంపీపీకి అభినందనలు తెలియజేశారు.
గ్రామాల అభివృద్ధిపై ఆశలు: నూతన పాలకవర్గం కొలువుదీరడంతో గ్రామీణ సమస్యల పరిష్కారంపై ప్రజల్లో ఆశలు చిగురించాయి. తాగునీరు, అంతర్గత రహదారులు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని మండల ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.