తెలంగాణ నీటి వాటా విషయంలో రాజీపడే ప్రసక్తే లేదుః టీపీసీసీ చీఫ్ మహేష్
సూర్య, తెలంగాణ బ్యూరో ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర నీటి హక్కుల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడే ప్రసక్తే లేదని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణకు రావాల్సిన నీటి వాటా విషయంలో రాజీపడబోమని పలుమార్లు ప్రకటించారని గుర్తుచేశారు. నీటి విషయంలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలను, తెలంగాణకు చేసిన ద్రోహాన్ని కప్పిపుచ్చుకునేందుకే ఆ పార్టీ నేతలు కొత్త నాటకాలకు తెరలేపుతున్నారని విమర్శించారు. కేటీఆర్ చేస్తున్న రాజకీయ డ్రామాల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని అన్నారు. గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టింది కేసీఆర్ ప్రభుత్వమేనని ఆరోపించారు. కళ్యాణలక్ష్మి, ముఖ్యమంత్రి సహాయనిధి, షాదీ ముబారక్ పథకాలకు సంబంధించిన బిల్లులను కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు. బీఆర్‌ఎస్ నేతలు ఎన్ని రాజకీయ డ్రామాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. నాగార్జునసాగర్ నుంచి నీటిని తరలించకుండా అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని పేర్కొన్నారు. ప్రాజెక్టులను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు పరిధికి అప్పగించేందుకు అభ్యంతరం లేదని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వమే చెప్పిందని గుర్తుచేశారు. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో తెలంగాణ అభ్యంతరాలను కేంద్రానికి లేఖల ద్వారా తెలియజేశామని, తెలంగాణ అభ్యంతరాల కారణంగానే ఆ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు నిలిచిపోయాయని వివరించారు. అవసరమైతే తెలంగాణ హక్కుల కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. డ్యామ్‌లపై కేంద్ర బలగాలు, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నియంత్రణ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నప్పటికీ, కేంద్రాన్ని ప్రశ్నించకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాత్రమే బీఆర్‌ఎస్ నేతలు లక్ష్యంగా చేసుకోవడం వెనుక బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య ఉన్న లోపాయికారీ ఒప్పందమే కారణమని ఆరోపించారు. దక్షిణ తెలంగాణకు వరప్రదాయినిగా నిలిచే ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనులను బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్లపాటు నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా సాధించడంలోనూ విఫలమైందన్నారు. పదేళ్లపాటు కృష్ణా బేసిన్‌ను పట్టించుకోకుండా వదిలేసిందని మండిపడ్డారు. సాగునీటి ప్రాజెక్టుల పేరుతో సుమారు రూ.1.84 లక్షల కోట్ల ప్రజాధనాన్ని బీఆర్‌ఎస్ ప్రభుత్వం వృథా చేసిందని ఆరోపించారు. పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్, ఆర్డీఎస్ ఆధునికీకరణ, డిండి వంటి ప్రాజెక్టులకు కేసీఆర్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చి ఉంటే రాష్ట్రంలో సాగునీటి విస్తీర్ణం గణనీయంగా పెరిగేదని అన్నారు. కృష్ణా జలాల విషయంలో గత ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసిందని, అప్పట్లో 36 శాతం నీటి వాటా సరిపోతుందని కేసీఆర్ అంగీకరించారని విమర్శించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు 70 శాతం వాటా సాధించేందుకు పోరాటం చేస్తోందని తెలిపారు. బీఆర్‌ఎస్ పాలనలో ఆంధ్రప్రదేశ్ 4,464 టీఎంసీల కృష్ణా జలాలను వినియోగించుకోగా, తెలంగాణకు 1,993 టీఎంసీలే దక్కాయని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును లోపభూయిష్టంగా నిర్మించారని, జాతీయ డ్యామ్ అథారిటీ, జాతీయ స్థాయి నిపుణులు సైతం ఈ ప్రాజెక్టుపై తమ అభిప్రాయాలు వెల్లడించారని అన్నారు. నెహ్రూ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులు దేశానికి దేవాలయాల వంటివని వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న చౌకబారు ప్రకటనల వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ చేసిన వ్యాఖ్యలను పార్టీ పరిశీలిస్తోందని, ఈ వ్యవహారంపై అధిష్ఠానం దృష్టి సారించిందని తెలిపారు. పరిస్థితులను బట్టి తగిన సమయంలో నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్ర కాంగ్రెస్ నూతన ఇన్‌చార్జి సందీప్ నిబద్ధత కలిగిన నాయకుడని, పార్టీని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తారనే విశ్వాసం ఉందని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
ఎ.రవీందర్, హైదరాబాద్.