పలమనేరు దొర చెరువు వద్ద వరుస రోడ్డు ప్రమాదాలు మూడు కార్లు ధ్వంసం.. రెండు కంటైనర్ లారీలు బోల్తా ప్రైవేట్ బస్సు ఢీకొని పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు
పలమనేరు మేజర్ న్యూస్
పలమనేరు పట్టణ సమీపంలోని దొర చెరువు వద్ద గురువారం వరుస రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. కంటైనర్ లారీలు, కార్లు, ప్రైవేట్ బస్సు ఒకదానికొకటి ఢీకొనడంతో వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదాల్లో రెండు కంటైనర్ లారీలు బోల్తాపడగా, మూడు కార్లు ధ్వంసమయ్యాయి. అయితే కార్లలో ప్రయాణిస్తున్న వారు, ప్రైవేట్ బస్సులోని ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీసుల సమాచారం మేరకు
పోలీసుల సమాచారం మేరకు.. ముందుగా వరి పొట్టుతో వెళ్తున్న ఓ లారీ అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తాపడింది. ఈ ప్రమాదాన్ని గమనిస్తూ వెళ్తున్న కంటైనర్ లారీ డ్రైవర్ రోడ్డుపై సరిగా దృష్టి పెట్టకపోవడంతో ముందున్న మరో కంటైనర్ లారీని వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ క్రమంలో కంటైనర్ అదుపుతప్పి ముందున్న కార్లపైకి దూసుకెళ్లింది. దీంతో మూడు కార్లు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో రెండు కంటైనర్ లారీలు బోల్తాపడ్డాయి.వరుస ప్రమాదాలతో రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాలు నెమ్మదిగా కదులుతున్న సమయంలో వెనుక నుంచి వస్తున్న మరో కంటైనర్ లారీ డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో, వెనుక వచ్చిన ప్రైవేట్ బస్సు కంటైనర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.ఒకదాని వెంట మరొకటి ప్రమాదాలు చోటుచేసుకోవడంతో దొర చెరువు సమీపంలో కొంతసేపు వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. వరుస ప్రమాదాలకు అసలు కారణాలు ఏమిటి? డ్రైవర్ల నిర్లక్ష్యమా లేక ఇతర కారణాలా? అనే పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.
రిపోర్టర్ అనిల్ కుమార్ యాదవ్