ప్రభుత్వ లాంఛనాలతో డాక్టర్ బాబ్జి అంత్యక్రియలు.
ఏలూరు, ఉమ్మడి ప.గో.జిల్లా సూర్య బ్యూరో :పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లు మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ వైద్యులు డాక్టర్ సీహెచ్ సత్యనారాయణ మూర్తి (బాబ్జి) మృతి పట్ల రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పాలకొల్లులో బుధవారం డాక్టర్ బాబ్జి పార్థివదేహాన్ని సందర్శించి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన అంతిమయాత్రలో పాల్గొని స్వయంగా పాడె మోసి తన అభిమానాన్ని, గౌరవాన్ని చాటుకున్నారు.
డాక్టర్ బాబ్జి వైద్య రంగంలోనే కాకుండా రాజకీయాల్లోనూ విశిష్ట సేవలందించి ప్రజల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారని మంత్రి నిమ్మల పేర్కొన్నారు. ఆయన మరణవార్తను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. డాక్టర్ బాబ్జి సేవలకు తగిన గౌరవం దక్కాలనే ఉద్దేశంతో ఆయన అంత్యక్రియలు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించేలా అప్పటికప్పుడు ప్రత్యేక అనుమతి ఉత్తర్వులు మంజూరయ్యేలా చొరవ తీసుకున్నారు.
దీంతో డాక్టర్ బాబ్జి అంత్యక్రియలు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. ప్రముఖ వైద్యునిగా, ప్రజాప్రతినిధిగా ఆయన అందించిన సేవలు ప్రజల మనసుల్లో శాశ్వతంగా నిలిచిపోతాయని మంత్రి నిమ్మల అన్నారు. డాక్టర్ బాబ్జి వంటి విశిష్ట వ్యక్తికి గౌరవం ఇవ్వడం అంటే మనల్ని మనం గౌరవించుకున్నట్లేనని పేర్కొన్నారు.
-బాల శౌరి , ఏలూరు.