భూముల రీ-సర్వేలో అవినీతికి తావుండకూడదు!అదనపు కలెక్టర్ నగేష్
మెదక్, : భూముల రీ-సర్వే ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ లైసెన్స్ సర్వేయర్లను ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భూముల రీ-సర్వేలో ఎలాంటి అవినీతికి తావులేకుండా నిబంధనల ప్రకారం విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు.గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారి ఏ.డీ. కిషన్ ఆధ్వర్యంలో లైసెన్స్ సర్వేయర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ మాట్లాడారు.ప్రజల నుంచి వచ్చే భూముల సర్వే, హద్దుల గుర్తింపు (ఎఫ్-లైన్) దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినా, రీ-సర్వే ప్రక్రియలో అలసత్వం ప్రదర్శించినా సంబంధిత సర్వేయర్ల లైసెన్సులు రద్దు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.సర్వే ప్రక్రియలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని, డీజీపీఎస్, రోవర్లు, టోటల్ స్టేషన్ల సహాయంతో కచ్చితమైన కొలతలు చేపట్టాలని సూచించారు. ఆన్‌లైన్ భూ రికార్డులను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని ఆదేశించారు.
సర్వే పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదు
భూముల సర్వే పేరుతో రైతులు, సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేయకూడదని అదనపు కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనల ప్రకారం నిర్దేశిత సేవా రుసుములను మాత్రమే వసూలు చేయాలని, అదనపు వసూళ్లకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.తహసీల్దార్లు, మండల సర్వేయర్లు, లైసెన్స్ సర్వేయర్లు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ క్షేత్రస్థాయిలో పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలు, హద్దుల వివాదాల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో మండల సర్వేయర్లు, జిల్లా పరిధిలోని లైసెన్స్ సర్వేయర్లు పాల్గొన్నారు.