international
యాపిల్ ఉద్యోగుల ఏఐ ఖర్చులపై కోత: రోజువారీ బడ్జెట్‌లో భారీ తగ్గింపు
క్యూపర్టినో:వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా అమెరికన్ టెక్ దిగ్గజం 'యాపిల్' కీలక నిర్ణయం తీసుకుంది. తమ సంస్థలో పనిచేస్తున్న ఇంజనీర్లు, డెవలపర్లు ఉపయోగించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాధనాలు, ప్రాసెసింగ్ ఖర్చులపై భారీగా కోతలు విధించింది. ఇప్పటివరకు ఇంజనీర్లకు రోజువారీ ఏఐ టూల్స్ వినియోగం కోసం కేటాయించిన 300 డాలర్ల బడ్జెట్‌ను కంపెనీ ఒక్కసారిగా 200 డాలర్లకు తగ్గించింది. అంతేకాకుండా, అంతగా ప్రాధాన్యం లేని కొన్ని నిర్దిష్ట విభాగాల్లో ఈ రోజువారీ ఏఐ ఖర్చుల పరిమితిని కేవలం 25 డాలర్లకే పరిమితం చేసే యోచనలో కంపెనీ యాజమాన్యం ఉన్నట్లు సమాచారం.
ఒకవేళ ఉద్యోగులకు ప్రాజెక్టు పనుల నిమిత్తం రోజువారీ పరిమితికి మించిన అదనపు ఏఐ నిధులు అవసరమైతే, వారు ఇకపై తమ విభాగపు ఉన్నతాధికారుల నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది.
ఇప్పటికే మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి ఇతర దిగ్గజ టెక్ సంస్థలు ఏఐ మౌలిక సదుపాయాలు మరియు పరిశోధనా వ్యయాలపై నియంత్రణలు విధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో యాపిల్ కూడా తమ ఏఐ వ్యయాన్ని అదుపు చేసేందుకు ఈ విధమైన ఆంక్షలు అమలులోకి తెచ్చింది.