'ఖేతీ బచావో అభియాన్'తో రైతులకు అవగాహన..
కట్టంగూర్ :'ఖేతీ బచావో అభియాన్' కార్యక్రమంలో భాగంగా గురువారం కట్టంగూర్ మండలం పిట్టంపల్లి గ్రామంలో రైతులకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గిరి ప్రసాద్ మాట్లాడుతూ.. ఎల్‌నినో పరిస్థితుల కారణంగా వర్షపాతం తగ్గి నీటి లభ్యతపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున రైతులు ముందస్తు ప్రణాళికతో పంటల సాగు చేపట్టాలని సూచించారు.
యాసంగిలో నీటి వినియోగం అధికంగా ఉండే వరి పంటకు ప్రత్యామ్నాయంగా శనగ, పెసర, మినుము, నువ్వులు, జొన్న, వేరుశనగ వంటి ఆరుతడి పంటలను సాగు చేయాలని తెలిపారు. తక్కువ నీటితో సాగయ్యే పంటలను ఎంచుకోవడం ద్వారా నీటి వనరులను కాపాడుకోవడంతో పాటు రైతులు పంట నష్టాల నుంచి కొంతమేర బయటపడవచ్చని వివరించారు.
అలాగే భూసంరక్షణకు ప్రాధాన్యతనిస్తూ అందుబాటులో ఉన్న నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవాలని, వ్యవసాయ శాఖ సూచనలు పాటిస్తూ ప్రత్యామ్నాయ పంటల సాగుకు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ, గ్రామ రైతులు పాల్గొన్నారు.