దళారులను నమ్మి మోసపోవద్దు.. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలనే ఆశ్రయించండి - ఏఎంసీ చైర్మన్ : రేవల్లి రాజలింగం
సూర్య - మానకొండూర్ : రైతులు దళారులను ఆశ్రయించి మోసపోకుండా, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే తమ ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని మానకొండూర్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రేవల్లి రాజలింగం సూచించారు. మానకొండూరు మండలం ఈదుల్లగట్టపల్లి గ్రామంలో 'హాకా' ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ వైస్ చైర్మన్ రెమిడి శ్రీనివాస్ రెడ్డి మరియు పాలకవర్గ డైరెక్టర్లతో కలిసి ఆయన గురువారం ప్రారంభించారు.ఈ సందర్భంగా చైర్మన్ రాజలింగం మాట్లాడుతూ.. అన్నదాతల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం మద్దతు ధరను కల్పిస్తోందని పేర్కొన్నారు. ప్రస్తుత సీజన్‌కు గాను ఏ-గ్రేడ్ రకానికి రూ. 2461/-, బి-గ్రేడ్ రకానికి రూ. 2441/- మద్దతు ధరగా ప్రభుత్వం ప్రకటించిందని రైతులకు తెలియజేశారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యం తేమ శాతం లేకుండా సరిగ్గా ఆరి ఉండేలా, తాలు మరియు చెత్తాచెదారం లేకుండా చూసుకోవాలని ఆయన కోరారు. నిబంధనల ప్రకారం ఎలాంటి అధిక తూకం లేకుండా బస్తాకు 40 కిలోల 600 గ్రాముల చొప్పున మాత్రమే తూకం వేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. రైతులెవరూ తొందరపడి దళారులకు అమ్ముకోవద్దని, ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే, కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగినన్ని టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని, అధికారులు అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా ఆయన ఆదేశించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మీసా సత్యనారాయణ, హాకా జిల్లా అధికారి కృష్ణయ్య, మానకొండూర్ సొసైటీ అధ్యక్షులు నాగిశెట్టి రాజయ్య,నాయకులు మర్రి ఓదెలు,రామినేని రమణ,దూలం వీరస్వామి గౌడ్, కనకం అశోక్, రామాంజనేయులు, ముక్కెర సతీష్,చిరంజీవి,బండి సమ్మయ్య, బందెల మహేందర్, మట్టెపల్లి ఆంజనేయులు, బెడద ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు...