40 ఏళ్లుగా భీమవరంలో నివాసం.. అయినా ఓటు హక్కు లేదు! గతంలో ఓటు వేసిన వ్యక్తికి ప్రస్తుత ఓటరు జాబితాలో పేరు గల్లంతు
వత్సవాయి మండలం భీమవరం గ్రామానికి చెందిన బొడ్డు గోపాలరావు (తండ్రి: బొడ్డు స్వామి) తనకు ఓటు హక్కు లేకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 40 సంవత్సరాలుగా భీమవరం గ్రామంలోనే నివాసం ఉంటున్నానని, గతంలో జరిగిన ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నానని ఆయన తెలిపారు. అయితే ప్రస్తుత ఎన్నికల ఓటరు జాబితాలో తన పేరు లేకపోవడంతో ఓటు వేసే అవకాశం కోల్పోయానని వాపోయారు.
ఈ విషయంపై రెవెన్యూ అధికారులను సంప్రదించగా, ఓటరు జాబితాలో పేరు లేకపోతే తాము ఏమీ చేయలేమని తహసీల్దార్ తెలిపినట్లు గోపాలరావు పేర్కొన్నారు.
40 ఏళ్లుగా ఒకే గ్రామంలో నివాసం ఉంటూ, గతంలో ఓటు వేసిన తనకు ప్రస్తుతం ఓటు హక్కు లేకపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి ఈ వ్యవహారంపై విచారణ జరిపించి, తన ఓటు హక్కు పునరుద్ధరణకు తగిన చర్యలు తీసుకోవాలని బొడ్డు గోపాలరావు విజ్ఞప్తి చేస్తున్నారు.