మహిళా సంఘాలు వ్యాపార కేంద్రాలుగా ఎదగాలి. డీఆర్డీఓ ఉమాహారతి
సంగారెడ్డి, ; సంగారెడ్డి జిల్లా మహిళా సమాఖ్య 110వ సమావేశం జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు శ్రీమతి యోగేశ్వరి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి (డీఆర్డీఓ) ఎన్. ఉమాహారతి ఐఏఎస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు కేవలం పొదుపు సంఘాల సభ్యులుగా మాత్రమే కాకుండా, విజయవంతమైన వ్యాపారవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. పొదుపు సంఘాలు వ్యాపార కేంద్రాలుగా రూపుదిద్దుకోవాలని, మహిళా సమాఖ్యలు కేవలం రుణాల పంపిణీ సంస్థలుగా కాకుండా వ్యాపార రంగంలోనూ తమదైన ముద్ర వేయాలని సూచించారు.ప్రతి మండల సమాఖ్య సొంత ఆదాయాన్ని సమకూర్చుకునే కార్యక్రమాలను చేపట్టాలని, ఇందుకు అవసరమైన శిక్షణతో పాటు పెట్టుబడి సహకారం కూడా అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. వచ్చే నెలలో జరిగే సమావేశానికి ప్రతి మండల సమాఖ్య ఆదాయ వృద్ధికి సంబంధించిన స్పష్టమైన ప్రతిపాదనలతో రావాలని సూచించారు. ఈ కార్యక్రమాల అమలుకు డీపీఎంలు ప్రత్యేక బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు.అదేవిధంగా అన్ని మండల సమాఖ్యలకు మంజూరైన భవన నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు సంబంధిత ఎంఆర్ఓ, ఎంపీడీఓలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో నీటి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, వీబీ-జీ రామ్ జీ పథకం ద్వారా ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని, అవకాశం ఉన్న ప్రాంతాల్లో నీటి కుంటలు నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా డీపీఎంలు సెర్ప్ కార్యక్రమాల అమలు, వాటి లక్ష్యాలు, మహిళా సమాఖ్యల బాధ్యతలపై అవగాహన కల్పించారు.ఈ సమావేశంలో గౌరవ అదనపు డీఆర్డీఓ, జిల్లాలోని 23 మండలాల సమాఖ్యల అధ్యక్షులు, డీపీఎంలు పాల్గొన్నారు
.