international
చోటా షకీల్ బావమరిది ఆస్తులను జప్తు చేసిన ఈడీ
ముంబై:అండర్‌వరల్డ్ గ్యాంగ్‌స్టర్ చోటా షకీల్ బావమరిది మహమ్మద్ సలీమ్ ఇక్బాల్ ఖురేషీ అలియాస్ సలీమ్ ఫ్రూట్‌కు సంబంధించిన కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ముంబైలో నమోదైన అక్రమ వసూళ్లు, ఫోర్జరీ కేసు దర్యాప్తులో భాగంగా ఈ కీలక చర్యలు చేపట్టింది.
దక్షిణ ముంబైలోని దోంగ్రీ పరిధిలో ఉన్న లంబత్ బిల్డింగ్‌లోని స్థిరాస్తులతో పాటు, సలీమ్ ఫ్రూట్ భార్య పేరిట ఉన్న బ్యాంక్ ఖాతాల్లోని నిధులను అధికారులు జప్తు చేశారు. ఈ చర, స్థిరాస్తుల మొత్తం విలువ సుమారు రూ. 4 కోట్లు ఉంటుందని ఈడీ ప్రకటించింది.
దావూద్ ఇబ్రహీం, చోటా షకీల్ పేరు చెప్పి వ్యాపారులను బెదిరించడం, ఫోర్జరీ పత్రాలు సృష్టించి భూములు కాజేయడం వంటి ఆరోపణలపై దాదర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ విచారణ ప్రారంభించింది. ఈ అక్రమ మార్గాల ద్వారా సంపాదించిన సొమ్ముతోనే సలీమ్ ఫ్రూట్ తన కుటుంబసభ్యుల పేరిట ఆస్తులను కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో నిర్ధారణ కావడంతో ఈ జప్తు చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.