ప్రభుత్వ ఉద్యోగుల సేవల్లో ఇక డిజిటల్ పారదర్శకత!అదనపు కలెక్టర్ నగేష్
మెదక్, : ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు రికార్డులు, వ్యక్తిగత వివరాలు, సేవా సంబంధిత కార్యకలాపాలను మరింత వేగవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రవేశపెడుతున్న నూతన ఈ-హెచ్ఆర్ఎంఎస్ విధానాన్ని జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో సమర్థవంతంగా అమలు చేసేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు.ప్రభుత్వ ఉద్యోగుల పరిపాలనా సేవలను డిజిటలైజ్ చేసే లక్ష్యంతో నూతనంగా ప్రవేశపెడుతున్న ఈ-హెచ్ఆర్ఎంఎస్ విధానంపై గురువారం మెదక్ జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ) సమావేశ మందిరంలో అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.రాష్ట్ర ఖజానా, లెక్కల శాఖ సంచాలకులు, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ శిక్షణ కార్యక్రమం కొనసాగింది.ప్రస్తుతం అమలులో ఉన్న హెచ్ఆర్ఎంఎస్ విధానం స్థానంలో నూతన ఈ-హెచ్ఆర్ఎంఎస్ విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్న నేపథ్యంలో సాఫ్ట్‌వేర్ వినియోగం, ఉద్యోగుల వ్యక్తిగత వివరాలు, సర్వీసు రికార్డుల నమోదు, వివిధ పరిపాలనా ప్రక్రియలు, నూతన విధానంలో అందుబాటులో ఉండే సదుపాయాలపై అధికారులు, సిబ్బందికి శిక్షణ అందించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ.. నూతన ఈ-హెచ్ఆర్ఎంఎస్ విధానం అమలుపై అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ప్రభుత్వ సేవల నిర్వహణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని, ఉద్యోగుల సర్వీసు సంబంధిత కార్యకలాపాలను వేగంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఈ విధానం దోహదపడుతుందని పేర్కొన్నారు.ఈ శిక్షణ కార్యక్రమానికి మెదక్ జిల్లా ఖజానా శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అనిల్ కుమార్ నాయకత్వం వహించి, నూతన విధానం అమలు, సాఫ్ట్‌వేర్ వినియోగం, ఉద్యోగుల వివరాల నమోదు తదితర అంశాలను వివరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఖజానా శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అనిల్ కుమార్, ఏటీఓ కార్తీక్, ఎస్టీఓలు నర్సాపూర్‌కు చెందిన టి. శ్రీనివాస్, రామాయంపేటకు చెందిన నాగరాణి, తూప్రాన్‌కు చెందిన ప్రసాద్, వివిధ శాఖల జిల్లా అధికారులు, డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారులు (డీడీఓలు), వారి కార్యాలయాల సిబ్బంది పాల్గొన్నారు.