పోలింగ్ కేంద్రాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి
ఏలూరు, : ఏలూరు నగరపాలక సంస్థ, నూజివీడు, జంగారెడ్డిగూడెం పురపాలక సంఘాలలో ఆదివారం జరిగిన పోలింగ్ సరళిని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి కలెక్టరేట్ లోని తన ఛాంబర్ నుండి వెబ్ కాస్టింగ్ లో పరిశీలించారు. ప్రతీ పోలింగ్ కేంద్రంలో ఓటర్ల క్యూ లైన్లు, పరిసరాలలో, పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్లు, 200 మీటర్ల పరిధిలో భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. ఓటర్లు ఓటు వేసే విధానంలో గోప్యత ఉన్నదా.. లేదా.. అనే విషయాన్నీ కూడా పరిశీలించారు. ఎక్కడైనా ప్రజలు గుమిగూడినట్లు కనిపెడితే సంబంధిత పోలింగ్ అధికారికి, పోలీస్ సిబ్బందికి ఫోన్ చేసి వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. జిల్లాలో ఎక్కడా ఎలాంటి శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా అధికారులు, పోలీస్ అధికారులతో సమన్వయము చేసుకుంటూ పరిస్థితులను అనుసరించి అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తూ, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహణ జరిగేలా పోలింగ్ ప్రక్రియ, సరళని కలెక్టర్ వెట్రిసెల్వి వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించారు.