పోలింగ్ సామగ్రి స్వీకరణలో నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలి
పోలింగ్ సామగ్రి స్వీకరణలో నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలి
రిసెప్షన్ కేంద్రంలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే స్వీకరించాలి – జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ
పెడన, మేజర్ న్యూస్: రెండవ సాధారణ స్థానిక సంస్థల ఎన్నికలు–2026లో భాగంగా పెడన పురపాలక సంఘానికి నిర్వహించిన పోలింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం, సెయింట్ విన్సెంట్ పల్లోట్టి హైస్కూల్లో ఏర్పాటు చేసిన రిసెప్షన్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డీకే బాలాజీ మరియు జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ ఆదివారం సందర్శించి, పోలింగ్ సామగ్రి స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు.
ఈ సందర్భంగా రిసెప్షన్ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. పోలింగ్ ప్రక్రియ ముగించుకొని పోలింగ్ అధికారులు బ్యాలెట్ బాక్సులు, ఇతర పోలింగ్ సామగ్రిని రిసెప్షన్ కేంద్రానికి తీసుకువచ్చే సమయంలో త్వరగా అప్పగించి వెళ్లాలనే ఆత్రుతలో ఉంటారని, అయితే అధికారులు ఎట్టి పరిస్థితుల్లోనూ తొందరపడకుండా ప్రతి అంశాన్ని అప్రమత్తంగా, బాధ్యతాయుతంగా పరిశీలించాలని సూచించారు. పోలింగ్ అధికారుల నుంచి బ్యాలెట్ బాక్సులు, ఎన్నికలకు సంబంధించిన ఇతర సామగ్రిని స్వీకరించే ముందు వాటి వివరాలను సంబంధిత రికార్డులతో సరిపోల్చుకోవాలని, ప్రతి కవర్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. హ్యాండ్‌బుక్‌లో నిర్దేశించిన చెక్‌లిస్ట్ ప్రకారం అన్ని పత్రాలు, కవర్లు, ఎన్నికల సామగ్రిని క్రమపద్ధతిలో వెరిఫై చేయాలని, సంబంధిత రికార్డుల్లో నమోదు చేసిన అనంతరమే నిర్దేశిత రిసెప్షన్ కౌంటర్లు, స్ట్రాంగ్ రూములకు తరలించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎన్నికల సామగ్రి స్వీకరణలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఎన్నికల మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటించాలని సూచించారు.అనంతరం స్ట్రాంగ్ రూమ్‌ను పరిశీలించిన కలెక్టర్, అక్కడ ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్లు భద్రపరిచిన నేపథ్యంలో స్ట్రాంగ్ రూమ్‌ను తెరిచే ప్రక్రియను సంబంధిత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల సమక్షంలోనే నిబంధనల ప్రకారం చేపట్టాలని సూచించారు. అనంతరం బ్యాలెట్ బాక్సులు, ఇతర ఎన్నికల సామగ్రిని నిర్దేశిత విధానంలో స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.స్ట్రాంగ్ రూమ్ ఇన్చార్జితో మాట్లాడుతూ, ముందుగా రూపొందించిన లేఅవుట్ ప్రకారం ప్రతి బ్యాలెట్ బాక్స్‌ను నిర్దేశించిన ప్రదేశంలోనే ఉంచాలని, బ్యాలెట్ బాక్సుల అమరిక, భద్రత, పర్యవేక్షణ తదితర అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ సూచించారు. ఎన్నికల సామగ్రి భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా పూర్తి పారదర్శకతతో, ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా విధులు నిర్వహించాలని అధికారులకు స్పష్టం చేశారు.
ఈ పర్యటనలో సంబంధిత రిటర్నింగ్ అధికారులు (ఆర్ఓలు), అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు (ఏఆర్ఓలు), మున్సిపల్ కమిషనర్ మరియు ఇతర ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.