పర్యావరణ పరిరక్షణకు దోహదపడాలి
ఏలూరు, మేజర్ న్యూస్:సెయింట్ థెరిస్సా మహిళా కళాశాలలో మిషన్ లైఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బ్రిక్స్ సస్టైనబుల్ లైఫ్‌స్టైల్ వీక్ – 2026 కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డా. సిస్టర్ సునీల రాణి పుడోట ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను వివరించి, సహజ వనరులను పొదుపుగా వినియోగించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. నీటి సంరక్షణ, విద్యుత్ ఆదా, ప్లాస్టిక్ వినియోగం తగ్గింపు, చెట్ల పెంపకం , పరిశుభ్రమైన పరిసరాల ఏర్పాటుపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో అంతర్గత నాణ్యత హామీ విభాగం సమన్వయకర్త డా. సి.ఏ. జ్యోతిర్మయి, జాతీయ సేవా పథకం సమన్వయకర్త డా. కె. స్వర్ణలత, అధ్యాపకులు, జాతీయ సేవా పథకం, జాతీయ కేడెట్ దళం, పర్యావరణ క్లబ్ సాసా సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అధ్యాపకులు, విద్యార్థినులు కలిసి మిషన్ లైఫ్ ప్రతిజ్ఞ చేశారు. పర్యావరణహిత జీవనశైలిని అనుసరించడం, ప్రకృతిని సంరక్షించడం , భవిష్యత్ తరాలకు సుస్థిరమైన ప్రపంచాన్ని అందించేందుకు కృషి చేయాలని సంకల్పించారు.