నాగు పాము దర్శనం... భక్తుల్లో ఆధ్యాత్మిక ఆనందం
గుమ్మడిదల;మున్సిపాలిటీ పరిధిలోని వీరన్నగూడెం గ్రామంలో ఉన్న ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో శనివారం ఉదయం నాగుపాము దర్శనమివ్వడంతో భక్తుల్లో భక్తిభావం వెల్లివిరిసింది. ఆలయ ప్రాంగణంలో నాగుపాము కనిపించడంతో అక్కడికి వచ్చిన భక్తులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. పడగ విప్పి కనిపించిన నాగుపామును చూసి భక్తులు పరవశించిపోయారు. ఈ సందర్భంగా కొందరు భక్తులు నాగుపాముకు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి పాలు సమర్పించారు. సాక్షాత్తు వీరభద్రస్వామే నాగుపాము రూపంలో దర్శనమిచ్చారని, తమకు స్వామివారి ఆశీస్సులు లభించాయని భక్తులు విశ్వసించారు. ఈ అరుదైన దృశ్యాన్ని చూసేందుకు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.