కొనసాగుతున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల నిరసన -- 19వ రోజుకు చేరుకున్న రిలే నిరాహార దీక్షలు
నారాయణపేట, సూర్యన్యూస్: తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 19వ రోజుకు చేరుకున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఉద్యోగులు శాంతియుతంగా తమ ఆందోళనను కొనసాగిస్తూ, తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు. ఈ సందర్భంగా దీక్షా శిబిరాన్ని ఉద్దేశించి ఎన్‌హెచ్‌ఎం సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు బిక్షపతి, జిల్లా అధ్యక్షులు ప్రసాద్ మాట్లాడుతూ.. ఎన్నో సంవత్సరాలుగా వైద్య ఆరోగ్య శాఖలో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూ ప్రజలకు విశేష సేవలందిస్తున్నారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. అయినప్పటికీ, ఏళ్ల తరబడి సేవలందిస్తున్న ఉద్యోగుల సమస్యలు మాత్రం పరిష్కారానికి నోచుకోకపోవడం విచారకరమన్నారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఉద్యోగుల కష్టాలను గుర్తించి వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కేవలం హామీలతో కాలయాపన చేయకుండా, ఆచరణలో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. తమ హక్కులు, న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఉద్యోగులంతా ఐక్యంగా ఉన్నారని, ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చే వరకు ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 19 రోజులుగా కొనసాగుతున్న దీక్షలను ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించి, ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్‌హెచ్‌ఎం యూనియన్ ప్రధాన కార్యదర్శి వెంకట రమణ, కోశాధికారి రాఘవేందర్, సభ్యులు నరసింహారావు సగరి, మోనేష్ చారి, తిరుపతి, శ్రీలత, అర్చన, ఐశ్వర్య, నవ్య దీప్తి, శ్వేత శ్రీ, విరోజా, అనురాధ, సత్యజ, రామస్వామి, వినోద్ గౌడ్, రామకృష్ణారెడ్డి, సోహెల్ మునీర్, అజారుద్దీన్, ఆశభీ, రామేశ్వరి, అపర్ణ, నాగజ్యోతి, సుమిత్ర, అలివేలు పాల్గొన్నారు.
– రాజేష్ కుమార్, సూర్య రిపోర్టర్, నారాయణపేట.