కుటుంబ కలహం.. భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య
ఎల్బీనగర్ మేజర్ న్యూస్ ప్రతినిధి : కుటుంబ కలహం హత్యకు దారితీసిన ఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తపేట సత్యానగర్ కాలనీలో చోటుచేసుకుంది. భార్య కూరగాయలు కోసే కత్తితో భర్త ఛాతిపై పొడవడంతో అతడు మృతి చెందాడు.
చైతన్యపురి సీఐ కె. సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్‌కు చెందిన కొంతం ప్రభాకర్ (55) గత ఏడేళ్లుగా హైదరాబాద్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ భార్య రజిత (40), ఇద్దరు కుమార్తెలతో కలిసి గాయత్రి ప్రణవం అపార్ట్మెంట్లో నివసిస్తున్నాడు. శనివారం ఉదయం 9.20 గంటల సమయంలో భార్యాభర్తల మధ్య కుటుంబ విషయాలపై గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన రజిత ఇంట్లోని కూరగాయలు కోసే కత్తితో భర్త ఛాతిపై పొడిచింది. తీవ్ర రక్తస్రావం కావడంతో కుమార్తెలు 108 అంబులెన్స్‌లో కొత్తపేటలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న చైతన్యపురి పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, ఆధారాలు సేకరించారు. ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కె. సైదులు తెలిపారు.